Telangana Gst Revenue Increase :దేశంలో జీఎస్టీ రాబడులు ఏటికేడు పెరుగుతూ వస్తున్నాయి. 14 శాతానికి తక్కువ లేకుండా ప్రతి నెలా ఆదాయం పెరుగుతుందని జీఎస్టీ కౌన్సిల్ అంచనా వేసింది. జీఎస్టీ అమలులోకి వచ్చిన 2017 నుంచి ఐదేళ్లపాటు జీఎస్టీ కౌన్సిల్(GST Council) నిర్దేశించిన 14శాతం కంటే తక్కువ రాబడి వచ్చిన రాష్ట్రాలకు తరుగుదల మొత్తాన్ని కేంద్రం జీఎస్టీ(GST) పరిహారం కింద చెల్లిస్తూ వచ్చింది. ఐదేళ్లు పూర్తి కావడంతో ఈ నిర్దేశిత 14శాతం ఆదాయం పెరిగినా పెరగకపోయినా కేంద్రం నుంచి రూపాయి కూడా పరిహారం రాదు. వాస్తవానికి జీఎస్టీ అనేది డెస్టినేషన్ అండ్ యుటిలైజేషన్ ట్యాక్స్‌గా పిలుస్తారు. అంటే వస్తువు ఎక్కడ తయారవుతుందన్నది పక్కన పెడితే ఏ రాష్ట్రంలో వస్తువు వాడకం జరుగుతుందో ఆ రాష్ట్రానికే జీఎస్టీ వస్తుంది.
రాష్ట్రంలో అంతర్గతంగా వినియోగించే వస్తువులపై వచ్చే జీఎస్టీ మొత్తాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు(Central-State) సమానంగా పంచుకుంటాయి. ఇక ఇతర రాష్ట్రాలకు ఎగుమతి అయినా ఇతర రాష్ట్రాల నుంచి రాష్ట్రానికి దిగుమతి అయినా సరుకులపై వచ్చే జీఎస్టీని ఐజీఎస్టీ కింద జమ చేస్తారు. ఐజీఎస్టీ కింద జమైన మొత్తంలో సగం కేంద్రానికి పోగా మిగిలిన సగం మొత్తాన్ని ప్రతి నెల సెంట్రల్ క్లియరింగ్ ఏజెన్సీ ఎలక్ట్రానిక్ లెడ్జర్ ద్వారా ఆయా రాష్ట్రాలకు రావల్సిన మొత్తాన్ని సర్దుబాటు చేస్తుంది.
Gst Revenue Increased In Telangana : 2023-24 ఆర్థిక ఏడాదిలో గత ఏప్రిల్ నుంచి ఈ ఫిబ్రవరి వరకు రూ.18.40 లక్షల కోట్లు రాబడి వచ్చింది. 2022-23 ఆర్థిక సంవత్సరంతో ఇదే 11 నెలల్లో వచ్చిన రాబడితో పోలిస్తే ఇది 11.7 శాతం అదనం. ఫిబ్రవరి నెలలో వచ్చిన జీఎస్టీ రాబడులు చూస్తే అంతకు ముందు ఆర్థిక ఏడాది ఫిబ్రవరిలో వచ్చిన ఆదాయంతో పోలిస్తే జాతీయ సగటు వృద్ధి రేటు 14శాతం కాగా తెలంగాణ రాబడి 18శాతంగా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో 2023 ఫిబ్రవరిలో వచ్చిన 4424కోట్లతో ఈ ఏడాది ఫిబ్రవరిలో వచ్చిన రూ.5211 కోట్లు పోలిస్తే రూ.787 కోట్లు అధికంగా వచ్చినట్లు వాణిజ్య పన్నుల శాఖ అధికారులు తెలిపారు.
Telangana GST Collection Growth Rate :ఇక 2023-24 ఆర్థిక ఏడాది గడిచిన 11 నెలల్లో వచ్చిన ఆదాయాన్ని పరిశీలించినట్లయితే జాతీయ సగటున 12శాతం వృద్ధి నమోదు చేసింది. ఐజీఎస్టీ సర్దుబాటు చేయకముందు తెలంగాణ రాష్ట్రంలో ఏకంగా 19శాతం వృద్ధి నమోదు చేసింది. మన పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లో కేవలం 11శాతం పెరుగుదల నమోదైంది. ఇక ఐజీఎస్టీ సర్దుబాటు చేసిన తరువాత గత ఆర్థిక ఏడాది ఏప్రిల్ నుంచి ఫిబ్రవరి వరకు వచ్చిన జీఎస్టీ రాబడులు పరిశీలించినట్లయితే 2022-23 ఆర్థిక ఏడాదిలో రూ.34,686 కోట్లు రాగా, ఈ ఆర్థిక సంవత్సరం రూ.36,949 కోట్లు మేర జీఎస్టీ రాబడులు వచ్చినట్లు తెలుస్తోంది.