Telangana Assembly Sessions :తెలంగాణఅసెంబ్లీ ఇవాళ "భూ భారతి'' బిల్లుపై చర్చించి ఆమోదం తెలపనుంది. అనంతరం రైతు భరోసా విధివిధానాలపైనా సభలో స్వల్పకాలిక చర్చ జరగనుంది. జీహెచ్‌ఎంసీ, పురపాలక, పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లులు ఇప్పటికే శాసనసభ ఆమోదం పొందాయి. హైడ్రాకు అధికారాలను కట్టబెట్టేందుకు తీసుకొచ్చిన జీహెచ్‌ఎంసీ చట్ట సవరణ బిల్లుపై అసెంబ్లీలో విస్తృతంగా చర్చ జరిగింది. బీఆర్‌ఎస్, బీజేపీ సభ్యులు పలు అభ్యంతరాలు లేవనెత్తారు. అనాలోచితంగా అనేక నిర్మాణాలను కూల్చివేశారని, పేదలు భయపడే పరిస్థితి వచ్చిందని బీఆర్‌ఎస్ సభ్యులు విమర్శించారు. చెరువులు, కుంటలు పక్కన పేదల ఇళ్లు లక్షల సంఖ్యలో ఉంటాయని వారందరికి భరోసా ఇవ్వాలని కోరారు.
సభ ఆమోదం : హైడ్రాకు విస్తృత అధికారాలు కట్టబెడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీహెచ్‌ఎంసీ చట్ట సవరణ బిల్లు అసెంబ్లీలో ఆమోదం పొందింది. హైదరాబాద్‌లో చెరువులు, కుంటలు, నాలాలను కాపాడేందుకే ఈ సంస్థను ఏర్పాటు చేసినట్లు సర్కారు తెలిపింది. హైడ్రా పేదల ఇళ్లు కూల్చుతోందని ప్రతిపక్షాలు తీవ్రంగా ఆరోపించాయి. తాము లేవనెత్తిన అంశాలపై సరైన సమాధానం ఇవ్వలేదని బీఆర్‌ఎస్, బీజేపీలు సభ నుంచి వాకౌట్ చేశాయి. విపక్ష సభ్యులు లేకుండానే జీహెచ్‌ఎంసీ చట్ట సవరణ బిల్లు సహా పురపాలక, పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లులు శాసనసభ ఆమోదం పొందాయి.
సభలో బీజేపీ vs ఎంఐఎం : హైడ్రాపై చర్చలో పాల్గొన్న మజ్లిస్ శాసన సభాపక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ తాను ఎక్కడ అక్రమ కట్టడాలు నిర్మించలేదని స్పష్టంచేశారు. ప్రస్తుతం కోర్టులో కేసు నడుస్తోందని న్యాయస్థానాల కంటే బీజేపీ ఎక్కువనా? అని అక్బరుద్దీన్ అనడంతో బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర రెడ్డి తీవ్రంగా స్పందించారు. ఎందుకు తమ వైపు వేలు చూపిస్తూ మాట్లాడుతున్నారని మహేశ్వరరెడ్డి ప్రశ్నించారు. ఈ సమయంలో కొద్దిసేపు సభలో వాగ్వాదం చోటు చేసుకుంది. అనంతరం మంత్రి శ్రీధర్ బాబు సర్దిచెప్పారు. హైడ్రా పేరుతో కూల్చిన పేదల ఇళ్లకు నష్ట పరిహారం ఇస్తారా? బీజేపీ శాసనసభా పక్ష నేత ఏలేటి మహేశ్వర రెడ్డి ప్రశ్నించారు.