హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నెం.10లో తమ భూమి కబ్జాకు గురైదంటూ జరుగుతున్న ప్రచారాన్ని జలమండలి ఖండించింది. జలమండలికి చెందిన 2.20 ఎకరాల భూమి ఎలాంటి కబ్జాకు గురికాలేదని, తమ ఆధీనంలోనే ఉన్నట్లు జలమండలి ఎండీ అశోక్ రెడ్డి స్పష్టం చేశారు. కబ్జాపై సామాజిక మాద్యమాల్లో ప్రచారం కావడంతో రోడ్ నె.10లోని స్థలానికి రెవెన్యూ, పోలీసు, హైడ్రా అధికారులతో సంయుక్తంగా తనిఖీ చేయించి పరిస్థితిని సమీక్షించారు.
జలమండలికి చెందిన స్థలం వద్దకు హైడ్రా సిబ్బంది రావడంతో అక్కడ ఆక్రమణ జరిగిందని, కూల్చివేతలు జరుగుతున్నాయని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరిగింది. అయితే తమ స్థలం విషయంలో స్పష్టత కోసమే రెవెన్యూ, హైడ్రా అధికారుల సాయం తీసుకున్నట్లు జలమండలి ఎండీ తెలిపారు.
బసవతారకం ఆస్పత్రి సమీపంలో జలమండలికి ఒక దగ్గర ఎకరం భూమి ఉందని, అందులో 6 ఎంఎల్డీ సామర్థ్యంతో నిర్మించిన రిజర్వాయర్ ద్వారా బంజారాహిల్స్ లోని పలు ప్రాంతాలకు తాగునీటి సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. దానికి 150 మీటర్ల దూరంలో మరో 1.20 ఎకరాల ఉందని, అది రాళ్లతో కూడిన స్థలం కావడంతో రెవెన్యూ అధికారుల చేత సర్వే నిర్వహించి స్పష్టమైన సరిహద్దులు ఏర్పాటు చేసినట్లు అశోక్ రెడ్డి వివరించారు. అంతేకాకుండా ఈ స్థలంపై తెలంగాణ హైకోర్టు స్టేటస్ కో ఆర్డర్ ఉన్నందు వల్ల అక్కడ జలమండలి ఎలాంటి నిర్మాణాలు చేపట్టలేదని స్పష్టం చేశారు. ఈ కబ్జా అంశంపై హైకోర్టులో త్వరలోనే అఫిడవిట్ దాఖలు చేయనున్నట్లు అశోక్ రెడ్డి పేర్కొన్నారు.
'జీహెచ్‌ఎంసీ పరిధిలో ఇక నుంచి కూల్చివేతలు ఉండవు' - కీలక ప్రకటన చేసిన హైడ్రా కమిషనర్ రంగనాథ్