Free Power And Gas Cylinder Scheme Inauguration Today: అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారెంటీల అమలులో నేడు మరో కీలక అడుగు పడనుంది. ఇప్పటికే రెండు పథకాలు అమలు చేస్తుండగా, ఇవాళ మరో రెండింటికి శ్రీకారం చుట్టనున్నారు. గృహజ్యోతిలో భాగంగా 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, మహాలక్ష్మిలో భాగంగా రూ.500కు గ్యాస్ సిలిండర్ పథకాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మధ్యాహ్నం సచివాలయంలో లాంఛనంగా ప్రారంభించనున్నారు.
చేవెళ్లలో వాటిని ప్రారంభించాలని తొలుత భావించినా, ఎమ్మెల్సీ ఎన్నిక కోడ్ అమల్లోకి రావడంతో వేదిక మార్చారు. చేవెళ్లలోని ఫరా ఇంజినీరింగ్ కళాశాల ఆవరణలో సాయంత్రం కాంగ్రెస్ పార్టీ నిర్వహించే సభలో సీఎంతో పాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు పాల్గొంటారు. కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ పర్యటన రద్దు కావడంతో, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సభలో పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి.
ప్రియాంకాగాంధీ తెలంగాణ పర్యటన రద్దు - వర్చువల్గా 2 పథకాల ప్రారంభానికి ఏర్పాట్లు
Free Power Gas Cylinder Scheme :ఆరు గ్యారెంటీల పేరిట 13 పథకాలు అమలు చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, ఆరోగ్య శ్రీ రూ.10 లక్షలకు పెంపు హామీలను ఇప్పటికే ప్రభుత్వం అమలు చేస్తోంది. గృహజ్యోతి పథకంలో 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇవ్వనుంది. విద్యుత్ పంపిణీ సంస్థల ద్వారా ఆ పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రజా పాలనలో దరఖాస్తు చేసిన తెల్లరేషన్ కార్డుదారులకు పథకాన్ని వర్తింపచేయనుంది.