Rajiv Swagruha Properties Auction :రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ పరిధిలో ఖాళీగా ఉన్న ఇళ్ల స్థలాలు (ప్లాట్లు), ఇళ్లు, బహుళ అంతస్తుల భవనాలను వేలంలో విక్రయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. డిసెంబరులో దశల వారీగా అమ్మకాలు చేపట్టేందుకు గృహ నిర్మాణ సంస్థ కసరత్తు మొదలుపెట్టింది. ఈ విక్రయాలతో రూ.2 వేల కోట్ల ఆదాయం సమకూరుతుందని ప్రభుత్వం అంచనా వేస్తుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2007లో అప్పటి ప్రభుత్వం రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఇళ్ల నిర్మాణంతో పాటు ప్లాట్ల విక్రయం చేపట్టాలని నిర్ణయించి భూములను బదలాయించింది. అనంతరం పలు నిర్మాణాలు చేపట్టి అమ్మింది. అప్పట్లో పెద్ద మొత్తంలో ఇళ్లు, స్థలాలు మిగిలిపోయాయి.
ప్రస్తుతం అధికారంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని చేపట్టింది. ఈ పథకం అమలుకు నిధులను సమకూర్చుకునేందుకు రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ పరిధిలో ఉన్న ఆస్తులను విక్రయించాలనుకుంటుంది. ఈ నేపథ్యంలో స్థలాల, నిర్మాణాల ఎలా ఉన్నాయో అధ్యయనం చేసేందుకు మూడు ఉన్నతస్థాయి కమిటీలను నియమించింది. ఆయా కమిటీలు ఇటీవల ప్రభుత్వానికి నివేదికలు ఇచ్చాయి. వాటిపై సమీక్షించిన అనంతరం దశల వారీగా విక్రయాలు చేపట్టేందుకు ప్రభుత్వం నిర్ణయించింది.
గ్రేటర్ పరిధిలోనే సింహభాగం: విక్రయానికి సిద్ధం చేస్తున్న వాటిల్లో ఎక్కువ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్‌ఎంసీ) పరిధిలోనే ఉన్నట్లు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ప్రభుత్వం అంచనా వేసిన ఆదాయంలో రూ.1,600 కోట్ల నుంచి రూ.1,700 కోట్ల వరకు జీహెచ్‌ఎంసీ పరిధిలోనే వస్తుందని భావిస్తున్నారు. ఇక్కడ 760 ఫ్లాట్లు ఉండగా, పలు ప్రాంతాల్లో అపార్టుమెంట్లు కూడా నిర్మించారు. వాటిల్లో 36 అసంపూర్తిగా ఉన్నట్లు గుర్తించారు. 26 టవర్లు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని గాజులరామారం, జవహర్‌నగర్‌లో, పోచారం ఎనిమిది టవర్లు ఖమ్మం పట్టణంలో ఉన్నట్లు తేల్చారు.