Solar Fencing Protection To crops In Telangana :పంటలు వేసి, అవి చేతికి వచ్చే సమయానికి కోతులు, అడవి పందుల కారణంగా చేతికి రాకుండా పోతున్నాయి. ఒకవేళ వాటిపై దాడికి దిగితే తిరిగి మీదకు వస్తున్నాయి. ఇదిలా ఉండగా వన్యప్రాణుల కారణంగా నష్టపోయిన పంటకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి పరిహారాలు చెల్లించడం లేదు. ఈ నేపథ్యంలో హిమాచల్‌బాటలో నడిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మరి ఆ రాష్ట్రం వన్యప్రాణుల నుంచి పొలాలను కాపాడుకోడానికి పాటిస్తున్న జాగ్రత్తలు ఏంటో ఈ స్టోరీలో చూద్దాం.
దక్కని పరిహారం : వన్యప్రాణుల కారణంగా తెలంగాణలో ప్రతి సంవత్సరం 5 లక్షల ఎకరాల విస్తీర్ణంలో పంటలకు నష్టం జరుగుతోంది. మొక్కజొన్న, శనగ, వేరుశనగ, పత్తి, చెరకు, జొన్న, వరి, సోయాబీన్, పొద్దు తిరుగుడు, కందులు, పెసలు, కూరగాయల పంటలు, పండ్ల తోటలు తీవ్ర ప్రభావానికి గురవుతున్నాయి. ఇలా జరిగే నష్టానికి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనలోనూ పరిహారం దక్కడం లేదు.
కోతులు, అడవి పందులు గుంపులుగా వచ్చి పంటలను నాశనం చేస్తున్నాయి. అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్న వారిపైన దాడి చేస్తున్నాయి. వీటి కారణంగా గత పదేళ్లలో 40 మందికి పైగా మరణించారు. వందల మంది గాయపడ్డారు. బాధిత రైతులకు, కుటుంబాలకు పరిహారం అందడం లేదు. ఈ సమస్య ఇటీవల శాసనసభ, శాసనమండలి సమావేశాల్లోనూ చర్చకు వచ్చింది. మండల, జిల్లా పరిషత్ సమావేశాల్లోనూ ప్రజా ప్రతినిధులు ఎప్పటి నుంచో ప్రస్తావిస్తున్నారు. దీనిపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇటీవల వ్యవసాయ, నాబార్డు అధికారులతో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు.
ప్రభుత్వానికి నివేదిక :హిమాచల్‌ప్రదేశ్‌లో అమలులో ఉన్న సౌర విద్యుత్ కంచెల విధానంపై చర్చ జరిగింది. ఆ రాష్ట్రంలో అధ్యయనం చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ఇటీవల అధికారులు హిమాచల్‌ప్రదేశ్‌లో పర్యటించి ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు.