Telangana Assembly Monsoon Sessions 2024 : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత ఈ ఏడాది ఫిబ్రవరిలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలను నిర్వహించింది. సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా కేంద్రంతో పాటు రాష్ట్రాలు పూర్తిస్థాయి బడ్జెట్‌కు బదులు దీనికే ఆమోదం తెలిపాయి. రాష్ట్రంలో కూడా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పద్దులకు మాత్రమే అసెంబ్లీ ఆమోదం తెలిపింది. జులై వరకే ఇది అమల్లో ఉంటుంది.
కేంద్ర బడ్జెట్ ఆధారంగా కేటాయింపులు : ఆగస్టు నుంచి మార్చి వరకు అవసరమైన నిధుల కేటాయింపు కోసం పూర్తిస్థాయి బడ్జెట్ అమల్లోకి రావాల్సి ఉంది. దీంతో కేంద్రంలో కొత్తగా కొలువుదీరిన ఎన్డీయే సర్కార్ ఈ నెలలో పార్లమెంట్ సమావేశాలు నిర్వహించి పూర్తిస్థాయి పద్దును ప్రవేశ పెట్టనున్నట్లు తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌లో రాష్ట్రానికి కేటాయింపులు ఏ మేరకు ఉంటాయో చూసుకుని, వాటి ఆధారంగా ఇక్కడ తెలంగాణ సర్కార్ పూర్తిస్థాయి పద్దుకు తుది మెరుగులు దిద్దనుంది.
రాష్ట్రంలో ఇప్పటికే అమలవుతున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలు రానున్న రోజుల్లో ప్రవేశపెట్టనున్న పథకాల అమలుకు నిధుల కేటాయింపు తదితర అంశాలపై అసెంబ్లీ సమావేశాల్లో చర్చ జరగనుంది. రెండు లక్షల రూపాయల రైతు రుణమాఫీకి ఎంత ఖర్చు అవుతుంది? దానికి నిధుల సమీకరణ ఎలా చేయాలనే అంశంపై అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. ఇప్పుడు అమలవుతున్న రైతుబంధు పథకంతో అనర్హులకు కూడా లబ్ధి చేకూరుతుందని భావిస్తున్న తెలంగాణ సర్కార్ దానిని ప్రక్షాళన చేసే దిశలో ముందుకెళ్లాలని యోచిస్తోంది.
రైతు బంధులా రూ.10,000లు కాకుండా, రైతు భరోసా కింద ఎకరానికి రూ.15,000లు ఇచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. గత ప్రభుత్వంలో బీడుభూములకు, వ్యవసాయేతర భూములకు, కొండలు, రహదారులకు కూడా రైతుబంధు ఇచ్చారని అధికార పార్టీ విమర్శలు చేస్తోంది. ఈ నేపథ్యంలో అర్హులకు మాత్రమే అందేలా ఆలోచనలు చేస్తున్నట్లు సమాచారం. ధరణి పోర్టల్‌కు బదులుగా భూభారతిని తెస్తామని చెబుతూ వస్తున్న సర్కార్, ఇదే అంశంపై అసెంబ్లీలో చర్చించే అవకాశం ఉంది. ఇప్పుడున్న ఆర్‌ఓఆర్ చట్టం సమర్ధత కలిగినది కాదని అభిప్రాయపడుతున్న ప్రభుత్వం దానిని పూర్తి స్థాయిలో సవరించి పటిష్ఠ చట్టాన్ని అందుబాటులోకి తీసుకురావాలని యోచిస్తోంది.