తెలంగాణ

telangana

ETV Bharat / state

కొత్త ఆర్వోఆర్​ -2024 బిల్లు - ఈ విషయాలు మీకు తెలుసా? - ROR BILL 2024 TELANGANA

ఇవాళ సభలో కొత్త ఆర్వోఆర్‌-2024 బిల్లును ప్రవేశపెట్టనున్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి - భూ సమస్యలపై అప్పీళ్లకు అవకాశం - పరిష్కారానికి ల్యాండ్‌ ట్రైబ్యునళ్లు - ప్రతి భూ కమతానికి భూధార్‌

ROR BILL IN TELANGANA ASSEMBLY
New ROR Bill 2024 in Telangana (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : 5 hours ago

New ROR Bill 2024 in Telangana : రాష్ట్ర ప్రభుత్వం భూ సమస్యల నివారణకు కొత్త రెవెన్యూ చట్టం తీసుకువస్తోంది. ఈ మేరకు ఇవాళ అసెంబ్లీలో భూ దస్త్రాలు, యాజమాన్య హక్కుల చట్టం-2024 పేరుతో మంత్రి పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి బిల్లును ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అమల్లో ఉన్న ఆర్వోఆర్‌-2020ను రద్దు చేయనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న కొత్త చట్టంలో పట్టా భూముల యజమానుల హక్కుల సంరక్షణతోపాటు ప్రభుత్వ భూముల పరిరక్షణకు భద్రతాపరమైన సెక్షన్లను ఏర్పాటు చేశారు. అంతేకాకుండా ధరణి పోర్టల్​ పేరును కూడా భూమాతగా మార్చాలని సర్కారు నిర్ణయించింది.

2020లో గత ప్రభుత్వం ఏకకాల రిజిస్ట్రేషన్‌- మ్యుటేషన్‌ సేవల పేరతో తెలంగాణ పట్టా పాసుపుస్తకాలు, భూ దస్త్రాల చట్టం, ధరణి పోర్టల్​ను తీసుకొచ్చింది. అయితే ఇందులో అనేక సమస్యలు తలెత్తడంతో రాష్ట్ర ప్రభుత్వం కొత్త చట్టాన్ని తీసుకువస్తోంది. ఈ నేపథ్యంలో భూ సమస్యలను తహసీల్దారు, ఆర్డీవో, కలెక్టర్‌ స్థాయిలోనే పరిష్కరించుకునే అవకాశం కల్పిస్తోంది. రాష్ట్రస్థాయిలో, డివిజన్, జిల్లాల్లో ల్యాండ్‌ ట్రైబ్యునళ్లను కూడా ఏర్పాటు చేయనున్నారు. భూ సమస్యలపై అధ్యయనానికి ఈ ఏడాది జనవరి 9న రాష్ట్ర ప్రభుత్వం ఐదుగురు సభ్యులతోకూడిన ప్రత్యేకంగా కమిటీని ఏర్పాటు చేసింది.

ఈ కమిటీ పలు దఫాలు చర్చలు నిర్వహించగా నిపుణులు, రెవెన్యూ సంఘాలు, రైతులు, దేవాదాయ, వక్ఫ్​, అటవీశాఖల అధికారులతో సమావేశమైంది. తొలుత ప్రయోగాత్మకంగా రంగారెడ్డి జిల్లాలో పర్యటించి అక్కడి సమస్యలను అధ్యయనం చేసింది. అనంతరం రాష్ట్ర ప్రభుత్వానికి పలు సూచనలతో ఓ నివేదిక ఇచ్చింది. కమిటీ ఇచ్చిన సూచనల మేరకు రాష్ట్ర ప్రభుత్వం రంగారెడ్డి జిల్లా యాచారం, నల్గొండ జిల్లా తిరుమలగిరి మండలాల్లో పైలట్‌ సర్వేను చేపట్టి పలు కీలక సమస్యలను గుర్తించింది. వెంటనే ఆర్వోఆర్‌ చట్ట రూపకల్పన బాధ్యతను నిపుణులకు అప్పగించింది.

కొత్త చట్టంలోని కొన్ని కీలకాంశాలు

ఆబాదీకి హక్కులు : గ్రామ కంఠం (ఆబాదీ)లోని ఉన్న నివాస స్థలాలకు యాజమాన్య హక్కులు కల్పిస్తారు. వ్యవసాయేతర భూములకు కూడా మ్యుటేషన్‌ అవకాశం కల్పిస్తారు. హక్కుల కల్పనతో ప్రజలకు ఉన్న నివాస స్థలాల ధరలు పెరుగుతాయి. వాటిపై రుణాలు తెచ్చుకోవడానికి అవకాశమే కాకుండా అధికారికంగా విక్రయించుకోవచ్చు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వానికి రిజిస్ట్రేషన్ల ద్వారా రాబడి పెరుగుతుంది.

అప్పీల్​కు 60 రోజుల సమయం : భూ దస్త్రాల్లో అభ్యంతరాలకు సంబంధించి తహసీల్దారు జారీ చేసే ఉత్తర్వులపై ఆర్డీవోకు అప్పీల్‌ చేసుకోవడానికి సుమారు 60 రోజుల సమయం, మళ్లీ ఆర్డీవో ఇచ్చే ఉత్తర్వులపై కలెక్టర్‌కు అప్పీల్‌ చేసుకోవడానికి 60 రోజుల సమయం ఇస్తారు.

విచారణ తర్వాతే వారసత్వ బదిలీ : ఏక కాలంలో వారసత్వ బదిలీకి సంబంధించిన యాజమాన్య హక్కులను బదిలీ చేయరు. దరఖాస్తు అందిన తర్వాత కుటుంబసభ్యులకు నోటీసులు జారీ చేసి తగిన సమయం తర్వాతే వారసత్వ బదిలీని నిర్వహిస్తారు.

భూధార్‌ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతి కమతానికి భూధార్‌ సంఖ్యను కేటాయించనుంది. అయితే ఇది ఎప్పటినుంచి అనేది మాత్రం స్పష్టత ఇవ్వలేదు. ఈ విధానంలో శాశ్వత, తాత్కాలిక ప్రాతిపదికన అనే రెండు రకాలుగా భూధార్‌ సంఖ్య, కార్డులను జారీ చేస్తారు. అక్షాంశాలు, రేఖాంశాలతో జియోగ్రాఫికల్‌ లొకేషన్​ను గుర్తించి భూములకు హద్దులు నిర్ధారిస్తారు.

మ్యుటేషన్‌కు సర్వే పటం :ఆర్డీవో పరిధిలోకి భూమి మ్యుటేషన్‌ అధికారాలను తీసుకురానున్నారు. దీంతో మ్యుటేషన్‌కు దరఖాస్తు చేసుకునేటప్పుడు భూమి సర్వే సబ్‌ డివిజన్‌ పటాన్ని జత చేయాల్సి ఉంటుంది. ఆర్డీవో నిర్దిష్ట గడువులోగా మ్యుటేషన్​ను పూర్తి చేయాల్సి ఉంటుంది.

క్రిమినల్‌ చర్యలు : రాష్ట్ర ప్రభుత్వ భూములకు దొడ్డిదారిన పట్టాపాసు పుస్తకాలు పొందినా, జారీ అయినా వాటిని రద్దు చేసే అధికారం కలెక్టర్లకు ఉంటుంది. అంతేకాకుండా అక్రమాలకు పాల్పడిన వారిపై క్రిమినల్‌ చర్యలు తీసుకునే అధికారం కలెక్టర్లకు ఉంటుంది. అక్రమంగా ఉత్తర్వులు జారీ చేసిన అధికారులను కూడా సర్వీసు నుంచి తొలగిస్తారు.

సుమోటోగా సమీక్ష :భూ యజమానులకు సంబంధించి వచ్చిన ఫిర్యాదులను లేదా సక్రమం కాని భూముల రికార్డులపై రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా సమీక్ష చేసే అధికారం ఉంటుంది. అయితే సంబంధిత వ్యక్తులకు నోటీసులు ఇచ్చి వారి వివరణను తప్పనిసరిగా నమోదు చేయాల్సి ఉంటుంది.

భూసమస్యల పరిష్కారానికి ఆర్వోఆర్ చ‌ట్టం - పేద‌ల‌కు, రైతుల‌కు వరం - ror act 2024 draft copy

ABOUT THE AUTHOR

...view details