Why Heart Attack Comes in Morning: "రాత్రి పడుకునేటప్పుడు బాగానే ఉన్నాడు. అర్ధరాత్రి 12 గంటలప్పుడు లేచి బాత్రూరూం వెళ్లి వచ్చారు. కానీ తెల్లారేసరికి ఘోరం జరిగిపోయింది. నిద్రలోనే గుండె పోటు వచ్చి మరణించారు" అని మనలో చాలా మంది చెబుతుంటారు. గుండెపోటుతో మరణించేవారిలో చాలా మంది తెల్లవారుజామునే వస్తుంటుందని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే హార్ట్ ఎటాక్ వేకువజామునే ఎందుకు వస్తుంది? అందుకు గల కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
"తెల్లవారుజామున మన శరీరంలో ఎడ్రినల్ అనే హార్మోన్ ఎక్కువగా విడుదల అవుతుంది. ఫలితంగా గుండెకు రక్తాన్ని సరఫరా చేసే నాళాల్లో కొవ్వు చేరి పగిలే అవకాశం ఉంటుంది. ఇవి పగిలిపోయినప్పుడు రక్తం గడ్డకట్టి గుండె పోటు వచ్చే అవకాశం ఉంటుంది. రక్తం గడ్డకట్టడానికి ఉపయోగపడే ప్లేట్లెట్లు పనితీరు అవసరానికి మించి పనిచేయడం వల్ల రక్తం గడ్డకట్టే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. దీంతో ఈ సమయంలో గుండె పోటు వచ్చే ప్రమాదం అధికంగా ఉంటుంది. దీంతో పాటు శారీరకంగా, మానసిక ఒత్తిడికి గురైనప్పుడు గుండెపోటుకు కారణమయ్యే కేటా కోలమైన్ విడుదలవుతుంది. ఇంకా కార్టిసాల్ అనే స్ట్రెస్ హర్మోన్ కూడా వేకువజామునే ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. ఇది రక్తాన్ని, ప్లేట్లేట్లను చిక్కగా చేస్తుంది. ఫలితంగా కోరనరీ, ధమనుల్లో రక్తపోటు, హృదయ స్పందన రేటు పెరుగుతుంది. ఈ పరిణామం గుండెపై ఒత్తిడి పెంచి మరింత ఎక్కువగా రక్తాన్ని పంప్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఫలితంగా కూడా గుండె పోటు వచ్చే ఛాన్స్ ఉంటుంది."
--డాక్టర్ వి. రవీంద్ర దేవ్, కార్డియాలజిస్ట్
తెల్లవారుజామున వచ్చే గుండె నొప్పిని ఎప్పుడూ అశ్రద్ధ చేయకూడదని నిపుణులు అంటున్నారు. ఉదయం అయ్యాక ఆస్పత్రికి వెళ్తామని పడకోకూడదని చెబుతున్నారు. ఇలాంటి వారు ఎకోస్ప్రిన్ 150 అనే ట్యాబ్లెట్లు తీసుకోవాలని ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ వి. రవీంద్ర దేవ్ చెబుతున్నారు. నొప్పి మరి ఎక్కువ అయితే సార్బిట్రేట్ అనే ట్యాబ్లెట్ నాలుక కింద పెట్టుకోవాలని అంటున్నారు. మాత్రలు వేసుకున్నా సరే.. వీలైనంత త్వరగా ఆస్పత్రికి వెళ్లి చికిత్స తీసుకోవాలని సూచిస్తున్నారు. ట్యాబ్లెట్లు కేవలం నొప్పిని తగ్గించడానికి మాత్రమేనని వివరిస్తున్నారు. దీంతో పాటు ముఖ్యంగా గుండె పోటు వచ్చిన వారిని ఇబ్బంది పెట్టకూడదని నిపుణులు చెబుతున్నారు. కూర్చున్న వారిని లేపడం వల్ల కూడా గుండెపై ఎక్కువ ఒత్తిడి పడుతుందని వివరిస్తున్నారు. ముఖ్యంగా మెట్లు ఎక్కడం, నడవడం లాంటి పనులు చేయకూడదని హెచ్చరిస్తున్నారు. వీల్ చైర్, స్ట్రెచర్‌ను ఉపయోగించి ఆస్పత్రికి తీసుకెళ్లాలని చెబుతున్నారు.
మన శరీరంలో రక్తం గడ్డకట్టినప్పుడు దాన్ని కరిగించే వ్యవస్థ సహజంగానే ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. కానీ తెల్లవారుజామున ఈ వ్యవస్థ చాలా మందకోడిగా పనిచేస్తుందని అంటున్నారు. అందువల్ల ఈ సమయంలో రక్త నాళాల్లో గడ్డకట్టినది కరగకుండా.. ప్రసరణలో అవరోధం ఏర్పడుతుందన్నారు. ఫలితంగా గుండె కండరాలకు అవసరమైన ఆక్సిజన్ అందక గుండె పోటు వచ్చే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. అందుకే తెల్లవారుజామున వచ్చే గుండె నొప్పిని నిర్లక్ష్యం చేయకూడదని పేర్కొన్నారు. గ్యాస్, అజీర్తి అనుకోకుండా ఛాతీలో నొప్పి, ఆయాసం లాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆస్పత్రికి వెళ్లి చికిత్స తీసుకోవాలని సూచిస్తున్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
చలికాలంలో షుగర్ పెరుగుతుందా? ఈ చిన్న జాగ్రత్తలు పాటిస్తే అదుపులో ఉంటుందట!
చిన్న బెల్లం ముక్కతో షుగర్ కంట్రోల్లో ఉంటుందట! మరి చక్కెరకు బదులుగా వాడొచ్చా?