Hydra Commissioner Ranganath Latest Comments : జీహెచ్‌ఎంసీ పరిధిలోని కూల్చివేతలపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన చేశారు. హైడ్రా రాకముందు అనుమతి ఇచ్చిన వాటిని హైడ్రా కూల్చదని, అనుమతులు లేకుండా నిర్మించినప్పటికీ నివాస గృహాలను ముట్టుకోమని స్పష్టం చేశారు. 2024 జులై ముందు నిర్మించిన గృహాలను కూల్చదని తెలిపారు. ఎఫ్టీఎల్‌లో అనుమతి లేకుండా కట్టిన వాటిని మాత్రం వదిలేది లేదని, హైడ్రా కూల్చుతుందని వెల్లడించారు.
అనుమతులు లేని వ్యాపార, వాణిజ్య కట్టడాలను మాత్రం కూల్చుతాం. గతంలో అనుమతులు ఇచ్చి, తర్వాత రద్దు చేస్తే అవి అక్రమ కట్టడాలే. అనుమతులు రద్దైనా నిర్మాణాలు జరుగుతుంటే అవి అక్రమమే. కొందరు పేదలను ముందు పెట్టి, వెనక చక్రం తిప్పుతున్నారు. కబ్జాదారుల చర్యలను హైడ్రా తీవ్రంగా పరిగణిస్తుంది. - రంగనాథ్, హైడ్రా కమిషనర్
ఇప్పటివరకు 200 ఎకరాలు స్వాధీనం : హైడ్రాలో ఏమైనా లోటుపాట్లు ఉంటే వాటిని సవరించుకుని మరింత నిబద్ధతతో పని చేస్తోందని హైడ్రా కమిషనర్ రంగనాథ్ అన్నారు. వివిధ సందర్భాల్లో కోర్టులు ఇచ్చిన తీర్పులకు లోబడి ముందుకు వెళ్తోందని తెలిపారు. ప్రభుత్వం దిశానిర్దేశం మేరకు హైడ్రా పని చేస్తుందని పేర్కొన్నారు. హైడ్రాను బలోపేతం చేయడానికి ప్రభుత్వం పలు అధికారాలను కట్టబెట్టిందన్న ఆయన, సాంకేతికంగా కూడా మరింత బలంగా తయారవుతోందని తెలిపారు. గత 5 నెలల్లో హైడ్రా దాదాపు 200 ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుందని స్పష్టం చేశారు.
హైదరాబాద్‌లో చెరువుల ఎఫ్టీఎల్ మార్కింగ్ ఇప్పటికే మొదలైందన్న ఆయన, మార్కింగ్ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మల్లంపేట కత్వా చెరువు, అమీర్‌పూర్‌లో కూల్చినవి అక్రమ నిర్మాణాలే అని స్పష్టం చేశారు. గతంలో నిర్మాణాలకు అనుమతులు ఇచ్చి రద్దు చేస్తే అవి కూడా అక్రమ కట్టడాల కిందకే వస్తాయని అన్నారు.
ప్రజా సమస్యలు పరిష్కరించేలా హైడ్రా పని తీరు : హైడ్రాపై నమ్మకంతో ప్రజలు భారీగా ఫిర్యాదులు చేస్తున్నారని రంగనాథ్ అన్నారు. ఇప్పటి వరకు 5 వేలకు పైగా ఫిర్యాదులను హైడ్రా పరిష్కరించిందని తెలిపారు. ఇంకా పలు ఫిర్యాదులు పెండింగ్‌లో ఉన్నాయన్న ఆయన, ప్రతి ఫిర్యాదును క్షుణ్నంగా పరిశీలించాకే చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ప్రజా ఫిర్యాదులను పరిష్కరించేలా హైడ్రా పని తీరు ఉంటుందని, త్వరలో హైడ్రా పోలీస్ స్టేషన్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందన్నారు. భూ కబ్జాల వెనకున్న పాత్రధారులు, సూత్రధారులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.