How to Apply Learning Licence in Telangana : మీరు కొత్తగా ఏదైనా వాహనం కొన్నారా? లేదా కొనడానికి ప్లాన్ చేస్తున్నారా? అందుకోసం డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలనుకుంటున్నారా? అయితే, అంతకన్నా ముందు మీరు.. లెర్నర్స్ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. ఒకప్పుడు లెర్నింగ్ లైసెన్స్ పొందాలంటే ఆర్టీవో ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వచ్చేది. కానీ, ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. చాలా సింపుల్‌గా ఇంట్లో కూర్చొనే ఆన్లైన్లో లెర్నింగ్ లైసెన్స్ కోసం అప్లై చేసుకునే అవకాశం ఉంది. ఇంతకీ.. లెర్నింగ్ లైసెన్స్ పొందాలంటే కావాల్సిన అర్హతలేంటి? అవసరమైన పత్రాలు? ఎలా అప్లై చేసుకోవాలి? అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
తెలంగాణలో డ్రైవింగ్ లైసెన్స్ అవసరమైనవారు.. ముందుగా లెర్నింగ్ లైసెన్స్‌కు అప్లై చేయాలి. అందుకోసం ఓ పరీక్ష కూడా రాయాలి. అందులో పాస్ అయితేనే వారికి లెర్నర్ లైసెన్స్ ఇస్తారు. ఈ లెర్నర్ లైసెన్స్ వచ్చాక.. 6 నెలల లోపు పర్మనెంట్ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. ఏ వాహనం అయినా సరే డ్రైవింగ్ లైసెన్స్ పొందే విధానం ఇలాగే ఉంటుంది.
అర్హతలు :
- లైట్ మోటర్ వెహికల్ (LMV) లెర్నింగ్ లైసెన్స్ కోసం కనీసం 18 సంవత్సరాలు ఉండాలి.
- ట్రాన్స్పోర్ట్ వెహికల్(TV) లెర్నింగ్ లైసెన్స్ కోసం 20 ఏళ్లు ఉండాలి.
- బేసిక్ ఇంగ్లీష్ లేదా తెలుగులో చదవడం, రాయడం రావాలి.
- వాహనం నడపడానికి శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండాలి.
అవసరమైన పత్రాలు :
- ఆధార్ కార్డ్
- పాస్‌పోర్ట్ సైజు ఫొటోలు
- వయస్సు రుజువు కోసం (ఓటర్ ID, పాస్‌పోర్ట్, జనన ధృవీకరణ పత్రం మొదలైనవి)
- అడ్రస్ ప్రూఫ్ కోసం (ఆధార్ కార్డ్, ఓటర్ ఐడీ, రేషన్ కార్డ్ మొదలైనవి)
- అయితే, మీరు లెర్నింగ్ లైసెన్స్ కోసం అప్లై చేయడానికి ముందు RTA మార్గదర్శకాల ప్రకారం.. స్లాట్‌ను బుక్ చేసుకోవాలి. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం.
Procedure to Apply Learners License in Telangana :
- ఇందుకోసం ముందుగా తెలంగాణ RTA అధికారిక పోర్టల్ https://transport.telangana.gov.in/ ని సందర్శించాలి.
- అప్పుడు హోమ్ పేజీలో కుడివైపున "For Online Services and Payments Click Here" అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేస్తే మరో పేజీ ఓపెన్ అవుతుంది.
- అనంతరం ఓపెన్ ఆ పేజీలో "New Learner Licence" అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయాలి.
- అప్పుడు మీకు Online Learner Licence Slot Booking" అనే మరో న్యూ పేజీ ఓపెన్ అవుతుంది.
- అందులో జిల్లా, పరీక్ష కేంద్రం, చెల్లుబాటు అయ్యే మొబైల్ నంబర్ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత మీ ఫోన్‌కు వచ్చే ఓటీపీని ఎంటర్ చేసి క్యాప్చాను నమోదు చేయాలి.
- ఆ తర్వాత లెర్నింగ్ లైసెన్స్ స్లాట్ బుకింగ్ కోసం తగిన తేదీని ఎంచుకోవాలి.(అక్కడ పేర్కొన్న విధంగా అందుబాటులో ఉన్న సమయ స్లాట్‌లను సెలెక్ట్ చేసుకోవాలి)
- అనంతరం మీ లైసెన్స్ దరఖాస్తు కోసం పేరు, ఇంటి పేరు, పుట్టిన తేది, లింగం, తండ్రి/భర్త పేరు, ఎన్నికల సంఖ్య, జాతీయత, అర్హతలు, చెల్లుబాటు అయ్యే ఈమెయిల్ ID, బ్లడ్ గ్రూప్, ఎత్తు, ఐడెంటిఫికేషన్ మార్క్స్, ఆధార్ నంబర్ లాంటి వివరాలను ఎంటర్ చేయాలి.
- అదేవిధంగా.. ప్రస్తుత చిరునామా, శాశ్వత చిరునామా నమోదు చేయాలి. అనంతరం వెహికల్ కేటగిరీని ఎంచుకోవాలి. అలాగే, వాహన తరగతిని సెలెక్ట్ చేసుకోవాలి.
- ఇక చివరగా అందుకు తగిన చెల్లింపు చేస్తే.. మీ లెర్నింగ్ లైసెన్స్ స్లాట్ బుకింగ్ విధానం పూర్తి అవుతుంది.
- ఆ తర్వాత మీరు ఎంచుకున్న ఆర్టీఏ ఆఫీస్‌లో డెమో టెస్ట్ క్లియర్ చేసి.. లెర్నింగ్ లైసెన్స్ పొందవచ్చు.
ఇవీ చదవండి :
డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలా? జూన్ 1 నుంచి నయా రూల్స్ - ఇకపై నో టెస్ట్ డ్రైవ్!
ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ కావాలా? ఆన్లైన్లో అప్లై చేసుకోండిలా!