Ramoji Rao Passes Away : అనారోగ్య సంబంధిత సమస్యలతో రామోజీ గ్రూప్ సంస్థల ఛైర్మన్ రామోజీరావు తుదిశ్వాస విడిచారు. రామోజీ రావు అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సీడబ్ల్యూసీ సమావేశాల కోసం దిల్లీ వెళ్లిన సీఎం రేవంత్‌రెడ్డి అక్కడి నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారికి ఆదేశాలు జారీ చేశారు. ఏర్పాట్లు పర్యవేక్షించాల్సిందిగా రంగారెడ్డి జిల్లా కలెక్టర్, సైబరాబాద్ కమిషనర్‌ను సీఎస్ ఆదేశించారు.
CM Revanth Condolences to Ramoji Rao : ఈనాడు అధినేత, ప్రముఖ పారిశ్రామికవేత్త, పద్మవిభూషణ్ పురస్కార గ్రహీత రామోజీరావు మరణం తీవ్ర దిగ్భ్రాంతి కలిగించిందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. తెలుగు జర్నలిజానికి విశ్వసనీయత, తెలుగు పారిశ్రామిక రంగానికి విలువలు జోడించిన ఘనత ఆయనకే దక్కుతుందని చెప్పారు. తెలుగు పత్రికా, మీడియా రంగానికి రామోజీరావు లేని లోటు ఎప్పటికీ పూడ్చలేనిదని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు. రామోజీ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
"రామోజీరావు మరణం తీవ్ర దిగ్భ్రాంతి కలిగించింది. తెలుగు పాత్రికేయానికి రామోజీరావు విశ్వసనీయత జోడించారు. తెలుగు పారిశ్రామికరంగానికి రామోజీ విలువలు జోడించారు. మీడియా రంగంలో రామోజీరావు లేని లోటు పూడ్చలేనిది. రామోజీరావు ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని ప్రార్థిస్తున్నా. రామోజీరావు కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. అధికారిక లాంఛనాలతో రామోజీరావు అంత్యక్రియలు నిర్వహించాలని అధికారులను ఆదేశించాం." - రేవంత్‌రెడ్డి, ముఖ్యమంత్రి