Musi River Cleaning Step Forward : హైదరాబాద్ మహానగరంలో మురికికూపంగా మారిన మూసీ నదిని ప్రక్షాళన చేయాలని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం, ఆ దిశగా ముందడుగు వేసింది. మూసీకి పునర్జీవం వచ్చేలా నదిని శుద్ధి చేసేందుకు కొత్తగా 39 ఎస్టీపీలను నిర్మించనుంది. ఇందుకోసం జలమండలికి పరిపాలన అనుమతులిస్తూ రూ.3,849.10 కోట్లను కేటాయిస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిషోర్ ఉత్తర్వులు జారీ చేశారు.
మూసీ నది అభివృద్ధి కోసం ఇటీవల బడ్జెట్లో రూ. 1500 కోట్లను కేటాయిస్తున్నట్లు ప్రకటించిన ప్రభుత్వం, ఆ నిధులతో మూసీ నది తీరప్రాంత పర్యావరణ వ్యవస్థను పునరుద్దరించనున్నట్లు ప్రకటించింది. రాజధాని పరిధిలో సుమారు 56 కిలోమీటర్ల మేర ప్రవహిస్తున్న మూసీ నదిలోకి పరివాహక ప్రాంతాల్లోని కాలనీల నుంచి డ్రైనేజీ, వ్యర్థాలతో ఏళ్ల తరబడి మూసీనది కాలుష్య కోరల్లో చిక్కిందని తెలిపిన ప్రభుత్వం, దాన్ని సవాల్ తీసుకొని ప్రక్షాళన దిశగా కార్యచరణ మొదలుపెట్టింది.
మూడు ప్యాకేజీలుగా 39 ఎస్టీపీలను నిర్మించనున్న సీవరేజ్ బోర్డు : అందులో భాగంగా మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్కు బడ్జెట్లో భారీగా నిధులు కేటాయించింది. తాజాగా అమృత్ 2.0లో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో మురుగునీటి శుద్ధి కేంద్రాల నిర్మాణానికి పరిపాలన అనుమతులు ఇచ్చింది. జీహెచ్ఎంసీ, ఓఆర్ఆర్ పరిధిలో 39 ఎస్టీపీలను మూడు ప్యాకేజీల్లో నిర్మించి మురుగును మూసీలో కలువకుండా చేయాలని నిర్ణయించింది.