Rs.2 Lakhs Loan Waiver in Telangana :ఎన్నికల్లో ఇచ్చిన రెండులక్షలలోపు రైతు రుణాల మాఫీ ప్రక్రియను ఈనెల 15లోగా పూర్తి చేయాలని కాంగ్రెస్ సర్కార్ లక్ష్యంగా పెట్టుకొంది. ఈనెల 15లోపు ఆ ప్రక్రియ పూర్తిచేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి సవాల్ చేశారు. అందుకు అనుగుణంగా రాష్ట్ర మంత్రివర్గంలో రుణమాఫీకి ఆమోదముద్ర వేయడం సహా ఉత్తర్వులు జారీచేశారు. తొలుత లక్షలోపు ఉన్న అప్పును ఆ తర్వాత లక్షన్నరలోపు ఉన్న రుణాన్ని ప్రభుత్వం మాఫీ చేసింది.
ఆ రైతులకు చెందిన మొత్తాన్ని వారి బ్యాంకు ఖాతాలో జమ చేసింది. ఇప్పటివరకు రెండు విడతల్లో 16 లక్షల 29 వేల కర్షక కుటుంబాలు రుణమాఫీ కింద ప్రయోజనం పొందాయి. లక్షన్నర వరకు రైతు రుణమాఫీ కింద రైతుల ఖాతాల్లో రూ. 12వేల 298 కోట్లు జమచేశారు. ఖమ్మం జిల్లా వైరా వేదికగా నిర్వహించే భారీ బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి రుణమాఫీ ప్రక్రియను పూర్తి చేయనున్నారు. మూడోవిడత రుణమాఫీ కోసం వ్యవసాయ, ఆర్థిక శాఖలు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశాయి.
ఎనిమిది కోట్లకుపైగా రుణమాఫీకి సిద్ధం : రెండు లక్షల వరకు రుణాలను మాఫీ చేసేందుకు అవసరమైన ప్రణాళికను సిద్ధం చేశాయి. అందుకు కావాల్సిన నిధులను ఇప్పటికే అందుబాటులో ఉంచినట్లు సమాచారం. మొదటి, రెండు విడతల్లో రూ.12 వేల కోట్లకు పైగా మాఫీచేయగా ఈసారి రూ. 8,000 కోట్లకు పైగా రుణమాఫీ కోసం సిద్ధం చేసినట్లు తెలిసింది. ఎఫ్ఆర్బీఎం పరిమితికి లోబడి తీసుకునే రుణాలు సహా ఇతరత్రా మార్గాల ద్వారా ఆ నిధులు సమకూరుస్తున్నట్లు సమాచారం.