Telangana Govt New Project Nature Tourism : వారాంతాల్లో మీ ఇంటిళ్లి పాది ట్రెక్కింగ్, నైట్ క్యాంపింగ్, బోటింగ్ అంటూ ప్రకృతిని ఆస్వాదించడానికి ఔటింగ్‌కు వెళ్లాలనుకుంటున్నారా? వేలకు వేలు డబ్బును ఖర్చు పెట్టి వందల కిలోమీటర్ల మేర ప్రయాణించి సమయం, డబ్బు వృథా చేసుకోవడం ఎందుకు? అయితే ఇలాంటి సౌకర్యాలను మీకు కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం సొంత రాష్ట్ర పర్యాటకులనే కాకుండా ఇతర రాష్ట్రాల పర్యాటకులను కూడా ఆకర్షించాలనే ఆలోచన చేసింది. ఆ దిశగా వేగంగా ముందుకు అడుగులు వేస్తూ 'ప్రకృతి పర్యాటకం' పేరుతో కొత్త ప్రాజెక్టును తీసుకువస్తోంది.
ఎటువంటి ప్రకృతి ప్రేమికుడైనా సరే చుట్టూ పచ్చని చెట్లు, ఎత్తైన కొండలు, చెంతనే గలగల ప్రవాహాలు ఇలాంటి మధురమైన వాతావరణం మధ్యలో చలిమంటలు కాగుతూ స్వచ్ఛమైన గాలిని ఆస్వాదించాలని కోరుకుంటాడు. ఇందుకోసం పర్యాటకులు కేరళ, కర్ణాటక, తమిళనాడు అంటూ ఇతర రాష్ట్రాలకు వెళుతుంటారు. వారందరినీ ఆకర్షించే విధంగా తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని అటవీ ప్రాంతాలు, జలవనరులు ఉన్న పరిసరాలను ప్రకృతి పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు ఇప్పటికే కసరత్తు చేస్తోంది.
కోటిపల్లి రిజర్వాయర్‌లో పర్యాటకులు (ETV Bharat) ఈ ప్రాజెక్టులో ప్రాథమికంగా 12 ప్రకృతి పర్యాటక సర్క్యూట్లను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. ఇందులో భాగంగా మూడు, నాలుగు ప్రాంతాలను ఒక సర్క్యూట్ కింద తీసుకువచ్చారు. ఇందులో రక్షిత అటవీ ప్రాంతాల్లో ఏడు సర్క్యూట్లు, అటవీ ప్రాంతాల వెలుపల ఐదు సర్క్యూట్లను గుర్తించారు. వీటిలో అమ్రాబాద్, కవ్వాల్ వంటి పెద్దపులులు తిరిగే అభయారణ్యాలు ఉన్నాయి. కుంటాల, పొచ్చెర, బొగత లాంటి జలపాతాలు ఉన్నాయి. రామప్ప, అనంతపద్మనాభస్వామి, బాసర తదితర ఆలయాలతో పాటు కోటిపల్లి రిజర్వాయర్, శామీర్‌పేట చెరువు, ప్రాణహిత నది, కిన్నెరసాని డ్యాం వంటి జలవనరులను ప్రకృతి పర్యాటక సర్క్యూట్లలో ప్రతిపాదించారు.
రాత్రి పూట బస చేసేందుకు ఏర్పాట్లు : ప్రస్తుతానికి అయితే ఈ ప్రాంతాల్లో కొంతమేర సౌకర్యాలు ఉన్నా చాలీ చాలనంతగా ఉన్నాయి. కొత్తగా రూపుదిద్దుకుంటున్న ఈ ప్రకృతి పర్యాటక విధానం ఖరారైతే మరిన్ని సౌకర్యాలు, సదుపాయాలను కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం ఫిక్స్ అయింది. పర్యాటకులను ప్రకృతి పర్యాటకం వైపు రప్పించేందుకు ట్రెక్కింగ్, సఫారీ, బర్డ్ వాచింగ్, బోటింగ్, కయాకింగ్, నైట్ క్యాంపింగ్ వంటి ఏర్పాట్లు చేయనుంది. వీటన్నింటికన్నా ముఖ్యంగా బోట్లు, సఫారీ వాహనాల సంఖ్యను పెంచాలి. అలాగే రాత్రి పూట ప్రకృతి ఒడిలో బస చేసేందుకు అవసరమైన వసతులు కల్పించనుంది. దీని ద్వారా భారీగా ఆదాయం రాష్ట్ర ఖజానాకు సమకూరుతుందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. దీంతో పాటు ఉపాధికి కూడా అవకాశం ఉందంది. ఈ పాలసీ అమలుకు ప్రభుత్వం తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థను నోడల్ ఏజెన్సీ(TGFDC)గా నియమించింది.
లక్నవరం వద్ద పర్యాటకుల విడిది కోసం ఏర్పాటుచేసిన గుడారాలు (ETV Bharat) రాష్ట్రంలోని 12 ప్రకృతి పర్యాటకం సర్క్యూట్లు ఇవే :
- అమ్రాబాద్ - సోమశిల : ఇక్కడ మన్ననూరు, సోమశిలలో వసతి ఏర్పాటు చేయనున్నారు. అమ్రాబాద్ రిజర్వులో సఫారీ, అభయారణ్యంలో ట్రెక్కింగ్, కృష్ణా బ్యాక్ వాటర్‌లో బోటింగ్, శ్రీశైలం ఆలయ సందర్శన కోసం ఏర్పాట్లు చేయనున్నారు.
- కవ్వాల్ : కవ్వాల్ టైగర్ రిజర్వులో సఫారీ, మంచిర్యాలలో గాంధారీ ఫోర్ట్ సందర్శన, శివ్వారం వైల్డ్‌లైఫ్ శాంక్షరీ సందర్శన, జన్నారంలో వసతి కల్పించనున్నారు.
- వికారాబాద్-అనంతగిరి :అనంతగిరిలో బసకు గెస్ట్‌హౌస్, అనంత పద్మనాభస్వామి ఆలయ సందర్శన, అనంతగిరి అడవిలో సఫారీ, కోటపల్లి రిజర్వాయర్‌లో బోటింగ్, కయాకింగ్ చేయనున్నారు.
- ఖమ్మం-కనకగిరి : కనకగిరి అటవీప్రాంతంలో సఫారీ, బర్డ్‌వాచ్, ట్రెక్కింగ్, బోటింగ్, కనకగిరిలో వసతి కల్పించనున్నారు.
- ఆదిలాబాద్ - కుంటాల : మావల పార్క్‌లో బోటింగ్, బర్డ్‌వాక్, సఫారీ, వసతి, కుంటాల పొచ్చెల వాటర్ ఫాల్స్, బోథ్ అర్బన్ పార్క్ సందర్శన, సాత్నాల చెరువులో బోటింగ్, ట్రెక్కింగ్‌కు ఏర్పాట్లు చేస్తున్నారు.
- కొత్తగూడెం-కిన్నెరసాని: కిన్నెరసాని ప్రాంతంలో వసతి. డ్యాంలో బోటింగ్, పాల్వంచలో సఫారీ, ట్రెక్కింగ్, రంగాపురం క్యాంప్ సందర్శన, జంగాలపల్లి అటవీప్రాంత సందర్శనకు ఏర్పాట్లు చేస్తున్నారు.
- పాకాల-ఏటూరునాగారం: తాడ్వాయి హట్స్, పాకాల, లక్నవరంలో వసతి, భొగత వాటర్‌ఫాల్స్, రామప్ప ఆలయం సందర్శన, ఏటూరునాగారం అభయారణ్యంలో టెక్క్రింగ్, క్యాంపింగ్, బర్డ్ వాచ్, పాకాల అభయారణ్యంలో క్యాంపింగ్ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు.
- నిజామాబాద్-నందిపేట: ఉమ్మెడ బ్యాక్ వాటర్ ప్రాంతంలో వసతి. బ్యాక్ వాటర్‌లో బోటింగ్, కృష్ణ జింకల సఫారీ, గాదెపల్లిలో రాత్రి బస, బాసర ఆలయ సందర్శనకు అన్ని సిద్ధం చేశారు.
- నల్గొండ-గాజుబిడెం: గాజుబిడెం బ్యాక్ వాటర్‌లో బస, బోటింగ్, నెల్లికల్ ఎకోపార్క్‌లో సఫారీ, కంబాలపల్లి అడవుల్లో ట్రెక్కింగ్.
- మేడ్చల్-శామీర్‌పేట: చెరువులో బోటింగ్, బర్డ్ వాచ్, రిసార్టుల్లో బస చేయడానికి ఏర్పాట్లు చేయనున్నారు.
- సంగారెడ్డి-మంజీర: మంజీర డ్యాం దగ్గర వసతి. డ్యాంలో బోటింగ్, బర్డ్ వాచింగ్.
- ఆసిఫాబాద్-కాగజ్‌నగర్: వేంపల్లిలో వసతి. ప్రాణహితలో బోటింగ్, గుండెపల్లిలో ట్రెక్కింగ్, సఫారీ, బర్డ్‌వాచింగ్. రాబందుల పాలరాపుగుట్ట సందర్శన.
Srinivas Goud on Telangana tourism : "విదేశీ యాత్రికులు.. తెలంగాణ వైపు చూస్తున్నారు"
Tent Tourism in Telangana : అడవిలో ఒకరోజు.. 'టెంట్ టూరిజం'పై పర్యాటక శాఖ కసరత్తు