Telangana Govt Released Second Installment Crop Loan Funds :అసెంబ్లీ ప్రాంగణంలో రైతు రుణమాఫీ నిధుల విడుదల కార్యక్రమం జరిగింది. రెండో విడత రైతు రుణమాఫీ నిధులు సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేశారు. ఈ విడతలో రూ.లక్ష నుంచి లక్షన్నర వరకు రుణమాఫీ కానుంది. 6.4 లక్షల మంది రైతులకు రూ.6,190 కోట్లు జమ చేశారు. తొలివిడతలో 11.34 లక్షల మంది రైతులకు రూ.6,035 కోట్లు విడుదల చేయగా రుణమాఫీ ద్వారా ఇప్పటివరకు 17.75 లక్షలమంది రైతులకు లబ్ధి చేకూరింది. రెండు దశల్లో కలిపి రైతుల ఖాతాల్లో రూ.12,225 కోట్లు ప్రభుత్వం జమ చేసింది.
ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ సోనియా, రాహుల్ ఇచ్చిన హామీ మేరకు రైతులకు రుణమాఫీ చేశామని అన్నారు. రూ.లక్షన్నర వరకు ఉన్న రైతుల రుణాలన్నీ మాఫీ చేశామని తెలిపారు. కార్పొరేట్ సంస్థల అధిపతులు బ్యాంకులను మోసం చేస్తున్నారని ఆరోపించారు. రైతులకు వన్‌టైమ్ సెటిల్‌మెంట్ కాదు ఫుల్‌టైమ్ సెటిల్‌మెంట్ చేశామని వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వం చేసిన అప్పులకు రూ.43 వేల కోట్ల వడ్డీ కట్టినట్లు వివరించారు. ఆర్థిక కష్టాలున్నా రైతులకు మేలు చేసిన భట్టికి అభినందనలు తెలిపారు.
అదే మా విధానం : కార్పొరేట్ కంపెనీలు ఈ పదేళ్లలో రూ.14 లక్షల కోట్లు ఎగవేశాయని రేవంత్ అన్నారు. రైతులు మాత్రం బ్యాంకుల నుంచి అప్పులు తెచ్చి సాగు చేస్తున్నారని తెలిపారు. అనేకమంది సొంత పొలంలోనే పురుగులమందు తాగి చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏ రైతు కూడా ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోకూడదనేది తమ విధానమని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం చేసిన రూ.లక్ష రుణమాఫీ వడ్డీ కట్టేందుకే సరిపోయిందని చెప్పారు.
"వాణిజ్య, వ్యవసాయ బ్యాంకుల నుంచి కూడా వివరాలు సేకరించాం. అప్పుల్లో కూరుకుపోయిన రాష్ట్రం రుణమాఫీ చేయలేదని విమర్శించారు. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా రుణమాఫీ చేసి తీరాలని చెప్పా. రైతు రుణమాఫీ మా ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనం. దేశ భద్రత, ఆహార భద్రతకు మా పార్టీ ప్రాముఖ్యత ఇచ్చింది. రైతుల కష్టాలను గుర్తించే నెహ్రూ ఆనాడు సాగునీటి ప్రాజెక్టులు నిర్మించారు. రైతులకు మేలు చేయాలనే ఇందిరాగాంధీ బ్యాంకుల జాతీయకరణ చేశారు. విత్తనాలు, ఎరువులు, వ్యవసాయ పనిముట్లు ఇచ్చిన ఘనత మా పార్టీదే. గిట్టుబాటు ధర ఇచ్చి రైతులను ఆదుకున్నది మా పార్టీ. ఆరు గ్యారంటీల అమలుకు మంత్రులందరూ అండగా నిలబడ్డారు. రైతుల పట్ల మా చిత్తశుద్ధిని ఎవరూ ప్రశ్నించలేరు."- రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రి
ఇలాంటి కార్యక్రమం దేశంలో ఎక్కడా జరగలేదు :రైతులకు రెండో విడత రుణమాఫీ చేయడం సంతోషంగా ఉందని ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క అన్నారు. రెండోవిడత రుణమాఫీ లబ్ధిదారులకు అభినందనలు తెలిపారు. రైతుల మేలు కోసం తమ ప్రభుత్వం ఎన్నో చర్యలు చేపట్టిందన్న, రుణమాఫీపై శరవేగంగా నిర్ణయాలు తీసుకున్నామని వివరించారు. రెండో విడతలో 6.4 లక్షల మంది ఖాతాల్లో రూ.6,190 కోట్లు జమ చేశామని పేర్కొన్నారు. రాష్ట్రంలోని రైతులందరికీ ఇవాళ పండుగ రోజు అన్న ఆయన ఇలాంటి కార్యక్రమం గతంలో మనదేశంలో ఎక్కడా జరగలేదని మంత్రి భట్టి విక్రమార్క అన్నారు.