US President Salary And Perks : అమెరికా నూతన అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ జనవరి 20న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ తరుణంలో అమెరికా ప్రెసిడెంట్‌కు జీతభత్యాలు ఎలా ఉంటాయి? ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తారు? ఇతర దేశాల ప్రభుత్వాధినేతలతో పోలిస్తే యూఎస్ అధ్యక్షుడికి అదనంగా అందే ప్రయోజనాల గురించి చాలా మంది ఆసక్తిగా ఉంటుంది. అందుకే అమెరికా అధ్యక్షుడికి ఇచ్చే జీతభత్యాలు గురించి, భద్రతా ఏర్పాట్లు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
సింగపూర్, హాంకాంగ్ ప్రభుత్వాధినేతలే టాప్
అమెరికా అధ్యక్షుడిగా ఉండేవారికి ఏటా 4లక్షల డాలర్లు (భారతీయ కరెన్సీలో రూ.3.46 కోట్లు) గౌరవ వేతనం లభిస్తుంది. అంటే ప్రతినెలా రూ.30 లక్షల వేతనం చేతికి అందుతుంది. 2001 సంవత్సరం నుంచి ఇంతే మొత్తాన్ని యూఎస్ ప్రెసిడెంటుకు ఇస్తున్నారు. వాస్తవానికి కొన్ని ప్రపంచ దేశాల ప్రభుత్వాధినేతలు ఇంతకంటే ఎక్కువ వేతనాలనే అందుకుంటున్నారు. సింగపూర్ ప్రధానమంత్రి రూ.13.85 కోట్ల వార్షిక వేతనాన్ని తీసుకుంటున్నారు. ఇది సింగపూర్ ప్రజల దేశీయ తలసరి ఉత్పత్తి (జీడీపీ)లో దాదాపు 1,320 శాతానికి సమానం. అయితే అమెరికా అధ్యక్షుడి వార్షిక వేతనం అనేది దాదాపుగా దేశ ప్రజల తలసరి జీడీపీకి (606 శాతం) సమానంగా ఉంటుంది. కెన్యా అధ్యక్షుడి వార్షిక వేతనం ఆ దేశ ప్రజల తలసరి జీడీపీలో 2,360 శాతం ఉంటుంది. టాంజానియా అధ్యక్షుడి వార్షిక వేతనం ఆ దేశ ప్రజల తలసరి జీడీపీలో 1,285 శాతం మేర ఉంటుంది. ఇక హాంకాంగ్ ప్రభుత్వ చీఫ్ ఎగ్జిక్యూటివ్ వార్షిక వేతనం రూ.6 కోట్లకుపైనే ఉంది. స్విట్జర్లాండ్ అధ్యక్షుడి వార్షిక వేతనం రూ.4.93 కోట్లు, ఆస్ట్రేలియా అధ్యక్షుడి వార్షిక వేతనం రూ.3.57 కోట్లు ఉంటుంది.
అదనపు భత్యాలు
- అమెరికా అధ్యక్షుడి జీతానికి అదనంగా చాలా రకాల భత్యాలు అందుతాయి. వ్యక్తిగత, కార్యాలయ విధుల భత్యంగా రూ.43 లక్షలను అందిస్తారు.
- దేశాధ్యక్షుడికి ప్రయాణ ఖర్చుల కోసం పన్ను మినహాయింపు సౌలభ్యంతో రూ.86 లక్షలు అందిస్తారు.
- కార్యక్రమాల నిర్వహణ ఖర్చులతో పాటు వినోద భత్యంగా రూ.16లక్షలు, వైట్ హౌస్ అలంకరణ ఖర్చుల కోసం రూ.86 లక్షలను యూఎస్ ప్రెసిడెంట్‌కు ఏటా ఇస్తారు.
- రూ.3.46 కోట్ల వార్షిక వేతనానికి ఇవన్నీ కలుపుకుంటే, అమెరికా అధ్యక్షుడికి ఏటా రూ.4.92 కోట్ల దాకా చేతికి అందుతాయి.
- దేశాధ్యక్షుడికి వసతి సౌకర్యాలు, నివాస సదుపాయంతో పాటు ఎయిర్ఫోర్స్ వన్ విమాన సర్వీసు, మెరైన్ వన్ సర్వీసు, సాయుధ లగ్జరీ కారును అందిస్తారు.
- అమెరికా సీక్రెట్ సర్వీసు ద్వారా ప్రెసిడెంట్‌కు రక్షణ లభిస్తుంది. ఆయన ఆరోగ్య ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుంది.
మాజీ అమెరికా అధ్యక్షుడికి సైతం
అమెరికా అధ్యక్షుడిగా సేవలు అందించి వైదొలగే వారికి ఏటా రూ.1.99 కోట్ల దాకా పెన్షన్ లభిస్తుంది. దీనికి అదనంగా మాజీ ప్రెసిడెంటుకు ఉచిత వైద్య వసతి ఉంటుంది. ఆఫీసు కోసం స్థలం ఇస్తారు. ఆఫీసులో పనిచేసే సిబ్బందికి వేతనాలను ప్రభుత్వమే చెల్లిస్తుంది. పుస్తకాల అమ్మకం, ప్రసంగాలు చేయడం వంటి కార్యక్రమాల ద్వారా మాజీ అధ్యక్షులు అదనపు ఆదాయాన్ని ఆర్జిస్తుంటారు.
అధ్యక్షుడిగా తొలిరోజే 100 సంతకాలు- డొనాల్డ్ ట్రంప్ ఫస్ట్ డే ప్లాన్ ఇదే!
ఎముకలు కొరికే చలి- ఇండోర్లోనే ట్రంప్ ప్రమాణస్వీకారం- నెవ్వర్ బిఫోర్ అనేలా ఏర్పాట్లు!