Old Man Burnt Alive After Smoking : నిద్రిస్తున్న ఓ వృద్ధుడు ప్రమాదవశాత్తు చుట్టకు అంటుకున్న మంటల్లో చిక్కుకుని సజీవ దహనమయ్యారు. ఈ ఘటన ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలోని రాజేశ్వరపురంలో జరిగింది. స్థానిక ప్రజలు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం, బత్తిని వెంకులు (70)కు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. సమీప ప్రాంతంలో కుమారులు, తల్లిదండ్రులు వేరు వేరుగా జీవనం సాగిస్తున్నారు. బత్తిని వెంకులు కొన్ని సంవత్సరాలుగా అనారోగ్యంతో బాధ పడుతున్నారు. 2 కాళ్లు కదపలేని స్థితిలో మంచానికే పరిమితం అయ్యారు.
చుట్ట తాగే అలవాటు ఉన్న బత్తిని వెంకులు శనివారం మధ్యాహ్నం చుట్టకాల్చాడు. ఆ చుట్ట ఆరక ముందే ఆదమరిచి జేబులో పెట్టుకున్నాడు. అనంతపం నిద్రలోకి జారుకున్నారు. అది క్రమేణా మంటలు అంటుకొని బత్తిని వెంకులు సజీవ దహనం అయ్యాడు. ఆ టైంలో కుటుంబ సభ్యులు, చుట్టుపక్కల వారు ఎవరూ లేకపోవడంతో ప్రమాదాన్ని గుర్తించలేదు. తన తాత ఇంటి నుంచి పొగ వస్తుండటాన్ని మనవరాలు ఆలస్యంగా గమనించింది. చుట్టుపక్కల వాళ్లను అప్రమత్తం చేయగా అప్పటికే బత్తిని వెంకులు మృతి చెందారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం స్థానిక సీహెచ్‌సీకి తరలించారు.