Telangana New Ration Cards : ఇప్పటికే ఉన్న రేషన్ కార్డులు యథాతథంగా కొనసాగుతాయని పౌరసరఫరాలశాఖ తెలిపింది. కులగణన సహా రేషన్ కార్డులకు సంబంధించిన ఏ జాబితాలోనూ పేర్లు లేనివారి నుంచి ఈ నెల 21- 24 వరకు జరిగే గ్రామ సభల్లో కార్డుల కోసం దరఖాస్తులు తీసుకుంటామని పేర్కొంది. ఇప్పటికే ఉన్న కార్డుల్లో కుటుంబ సభ్యుల పేర్లు చేర్చేందుకు వచ్చిన 12,07,558 దరఖాస్తులకు సంబంధించి 18,00,515 మంది పేర్లను అర్హతల మేరకు చేర్చనున్నట్లు తెలిపింది. ప్రజావాణి ద్వారా వచ్చిన దరఖాస్తులనూ పరిశీలించనున్నట్లు పౌరసరఫరాల శాఖ ఓ ప్రకటనలో తెలిపింది.
పేర్లు లేని వారి సంగతేంటి? : సామాజిక ఆర్థిక కులగణన టైంలో చాలా మంది పేదలు, మధ్య తరగతి ప్రజలు, ఉన్నత వర్గాలకు చెందిన వారు కార్డు లేదని చెప్పడంతో ఆ వివరాలను ఎన్యుమరేటర్లు నమోదు చేసుకుని ఆ జాబితాను ఉన్నతాధికారులకు పంపించారు. అక్కడ నుంచి వచ్చిన జాబితాలో అనేక మంది పేర్లు లేకపోవడంతో వారు నిస్సహాయంగా ఉండిపోయారు. అనేక మంది కుల గణన సర్వేలో పేరు నమోదు చేసుకున్నా జాబితాలో కనిపించడం లేదు. కంప్యూటరీకరించే టైంలో పేర్లు గల్లంతు అయినట్లు తెలుస్తోంది. అలాంటి వారి పరిస్థితి ఏమిటో స్పష్టం చేయడం లేదని ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం పరిశీలనకు వస్తున్న సిబ్బందిని కలిసి తమ పేర్లు ఉన్నాయో? లేదో అని చాలా మంది ఆరా తీస్తున్నారు. అన్ని అర్హతలు ఉండి జాబితాలో పేర్లు లేకపోవడంతో పేదలు ఆందోళన చెందుతున్నారు. అది రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉందంటూ జాబితాపై తమకు ఎలాంటి సమాచారం లేదని అధికారులు అంటున్నారు.
గ్రామసభల్లో మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చు : తెలంగాణలో అర్హులుగా ఉన్న ప్రతి ఒక్కరికీ కొత్త రేషన్ కార్డులు అందే వరకు జారీ ప్రక్రియ కొనసాగుతుందని పౌరసరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. సామాజిక ఆర్థిక సర్వే, కులగణన, పాత రేషన్‌కార్డుల జాబితా ఆధారంగా కొత్త కార్డుల జారీకి ప్రాథమిక జాబితా రూపొందించామని, ఇందులో పేరు లేనివారు గ్రామసభల్లో మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చని ఆయన ఓ ప్రకటనలో వెల్లడించారు.
తాజాగా ఇచ్చే దరఖాస్తులో ఉండాల్సిన సమాచారం : -
- కుటుంబ పెద్ద, ఇతర సభ్యుల పేర్లు, వారి ఆధార్ నంబర్లు
- మతం, కులం, మొబైల్ నంబరు, అడ్రస్
కొత్త రేషన్‌కార్డుల అర్హులు తేలారు - జిల్లాలకు చేరిన ఫైనల్ లిస్ట్
కొత్త రేషన్ కార్డుల జారీ డేట్ ఫిక్స్ - సభ్యుల వివరాలు చేర్చేదానిపై ఆరోజే స్పష్టత