Telangana RTC Job Notification 2024 :ఆర్టీసీలో ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. మొత్తం 3035 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తొలిసారి ఆర్టీసీలో ఉద్యోగ నియామకాలతో పాటు కొత్త బస్సు సర్వీసుల కొనుగోళ్లు సేవలు మెరుగు పరిచేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకొందని, కొత్త రక్తంతో ఆర్టీసీని మరింతగా బలోపేతం చేస్తామని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. త్వరలోనే ఉద్యోగాల భర్తీకి పూర్తిస్థాయి నోటిఫికేషన్లు వెలువరిస్తామని తెలిపారు.
ఆర్టీసీ ఉన్నతాధికారులు ప్రతిపాదనలు పంపిన అన్ని పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 3,035 పోస్టుల్లో 2,000 డ్రైవర్, 743 శ్రామిక్, 114 డిప్యూటీ సూపరింటెండెంట్(మెకానిక్), 84 డిప్యూటీ సూపరింటెండెంట్(ట్రాఫిక్), 25 డిపో మేనేజర్/అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్, 23 అసిస్టెంట్ ఇంజనీర్(సివిల్), 15 అసిస్టెంట్ మెకానికల్ ఇంజనీర్, 11 సెక్షన్ ఆఫీసర్(సివిల్), 7 మెడికల్ ఆఫీసర్(జనరల్), 7 మెడికల్ ఆఫీసర్(స్పెషలిస్ట్) కొలువులు ఉన్నాయని ప్రభుత్వం వెల్లడించింది.
3035 Posts in Telangana RTC :మహిళలకు ఉచిత బస్సు సదుపాయం కల్పించడంతో బస్సుల్లో ప్రయాణికుల సంఖ్య భారీగా పెరిగిందని, 100 శాతం అక్యూపెన్సి దాటిందన్నారు. దీనితో కొత్త బస్సుల కొనుగోలుపై ప్రజా ప్రతినిధుల నుంచి డిమాండ్స్ పెరుగుతున్న నేపథ్యంలో ఆర్టీసీలో డ్రైవర్లు, శ్రామిక్, మెకానిక్ ఇలా 3035 ఉద్యోగాల భర్తీకి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.