TG Govt Focus on Grama Sabhalu : కొత్త పథకాల అమలుకు నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, వార్డు సభలు జరగనున్నాయి. ఈ నెల 24 వరకు సభలు నిర్వహించి, లబ్ధిదారుల ఎంపికకు తుది కసరత్తు జరగనుంది. సభల్లో కుటుంబ సభ్యులు, ఆధార్ తదితర వివరాలతో కొత్తగా దరఖాస్తులు స్వీకరిస్తారు. రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల కోసం గతంలో దరఖాస్తు చేసుకోని వారు సభల్లో ఇవ్వొచ్చని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ నెల 26 నుంచి రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా సహా 4 కొత్త పథకాలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది.
నేటి నుంచి గ్రామ, వార్డు సభలు :గణతంత్ర దినోత్సవం నుంచి అమలు చేయనున్న ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాల లబ్ధిదారుల కోసం నేటి నుంచి తుది కసరత్తు జరగనుంది. ఆ నాలుగు పథకాల అమలు ప్రక్రియలో భాగంగా ఈ రోజు నుంచి ఈ నెల 24 వరకు గ్రామ, వార్డు సభలు నిర్వహించనున్నారు. పంచాయతీల్లో గ్రామ సభలు, నగరాలు, పట్టణాల్లో వార్డు సభలు నిర్వహిస్తారు.
కొత్తగా దరఖాస్తులు :రేషన్‌కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల కోసం ప్రజాపాలన దరఖాస్తులో పేర్కొన్న వారి నుంచి కుటుంబ సభ్యులు, ఆధార్, ఫోన్ నంబరు, కులం, చిరునామా వివరాలతో కొత్తగా దరఖాస్తులు స్వీకరిస్తారు. ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్ కార్డులు, ఇప్పుడున్న కార్డుల్లో కొత్త పేర్లు చేర్చడం కోసం గతంలో దరఖాస్తు చేసుకోకపోతే గ్రామ, వార్డు సభల్లో సమర్పించవచ్చని ప్రభుత్వం తెలిపింది.
ఎకరానికి ఏటా రూ.12 వేలు : రైతు భరోసా పథకంలో పంట పెట్టుబడి సాయం కోసం ఎకరానికి ఏటా రూ.12 వేలను రెండు విడతల్లో చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. పంట వేసినా, వేయకున్నా సాగుయోగ్యమైన భూములన్నింటికీ రైతు భరోసా ఇవ్వనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఐతే సాగు యోగ్యం కాని భూములకు పథకం వర్తించదని స్పష్టం చేసింది.
రైతు భరోసా పథకం : ఆ భూములను గుర్తించేందుకు వ్యవసాయ, రెవెన్యూ, నీటి పారుదల, పంచాయతీరాజ్ శాఖల అధికారులతో కూడిన బృందాలు క్షేత్రస్థాయిలో పర్యటించనున్నాయి. ఇప్పటికే గుర్తించిన అర్హుల ముసాయిదా జాబితాను గ్రామ, వార్డు సభల్లో వెల్లడించి అభ్యంతరాలు స్వీకరిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 60 లక్షల మంది రైతు భరోసా పథకానికి అర్హులైనట్లు వ్యవసాయ శాఖ అంచనా వేస్తోంది.