Telangana Govt on Household Caste Survey : మీ కుటుంబ సభ్యుల్లో ఎవరైనా రాజకీయ పదవులు పొందారా?, ప్రజాప్రతినిధిగా ఎన్నికయ్యారా?, మీకు సంక్షేమ పథకాలు అందుతున్నాయా?, ఎలా ఉపాధి పొందుతున్నారు?, భూమి ఉందా?, ఏడాదికి కుటుంబ ఆదాయం ఎంత వస్తుంది? ఈ ప్రశ్నలన్నీ దేని కోసం అని అనుకుంటున్నారా?. రాష్ట్రంలో ఇలాంటి ప్రశ్నలతోనే కులగణన, సామాజిక, ఆర్థిక సర్వేలో ప్రజలను అడిగేందుకు రాష్ట్ర ప్రణాళిక శాఖ ముసాయిదాను రూపొందించింది. ఈ మేరకు త్వరలోనే సర్వేను ప్రారంభించేందుకు కసరత్తు చేస్తోంది. ఒక్కో కుటుంబంలోని సభ్యుల సమాచార సేకరణకు మొత్తం 60 ప్రశ్నలను తయారు చేశారు.
వీటిలో సగం కుటంబం నేపథ్యంపైనే ఉండగా, మిగిలినవి పర్సనల్ వివరాలకు సంబంధించినవి ఉంటాయి. ఈ ప్రశ్నల్లో ఏవి అవసరమో రాష్ట్ర ప్రభుత్వమే నిర్ణయించాల్సి ఉంది. బీసీ కులాల వివరాల కోసమే రాష్ట్ర ప్రభుత్వం ఈ సర్వేను చేపట్టింది. బీసీ కులాల వారితో పాటు రాష్ట్ర ప్రజల్లో ప్రతి ఒక్కరి కులం, ఉపకులం ఏమిటి? స్థానికంగా కులాల పేర్లలో ఏమైనా మార్పులున్నాయ? వంటి వివరాలన్నీ సేకరిస్తారు. ఎవరైనా కులం పేరు తప్పుగా నమోదు చేయిస్తే భవిష్యత్తులో అనేక రకాలుగా తీవ్రంగా నష్టం జరుగుతుందని అధికారులు హెచ్చరిస్తున్నారు. తప్పుడు వివరాలు నమోదు కాకుండా స్థానిక అధికారులు సైతం జాగ్రత్తలు తీసుకోవాలని నిర్ణయించారు.
150 కుటుంబాలకో గణకుడు : ఈ సర్వేతో ప్రభుత్వం భవిష్యత్తులో సంక్షేమ పథకాలతో పాటు అనేక కార్యక్రమాలను నిర్వహించనుంది. ప్రతి ఒక్కరి ఆధార్, మొబైల్ నంబర్లతో పాటు వయసు తదితర వివరాలు నమోదు చేస్తారు. విద్యార్హత, ఉద్యోగం, సొంత ఇల్లు, కారు, బైక్ వంటివి ఉన్నాయా? అంటూ సమగ్ర సమాచారం సేకరిస్తారు. జనాభా లెక్కల కన్నా ఎక్కువ సమాచారాన్ని ఈ సర్వే ద్వారానే రాష్ట్ర ప్రభుత్వం సేకరించనుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 3.80 కోట్లకు పైగా జనాభా ఉన్నట్లు, మొత్తం కుటుంబాల సంఖ్య దాదాపు 1.10 కోట్లు దాటిందని అంచనా. దీనికి అనుగుణంగానే సిబ్బందిని నియమించేలా ప్రణాళిక శాఖ ప్రతిపాదనలు రూపొందించింది.
ప్రతి 150 కుటుంబాలకు ఒక సర్వే గణకుడిని నియమిస్తారు. ఈ లెక్కన చూస్తే మొత్తం 75 వేల మంది కావాలి. వీరిపై పర్యవేక్షకులుగా మరో 15 వేల మంది దాకా అవసరం. వీరిని నియమించడానికి అన్ని శాఖల సిబ్బంది నుంచి వివరాలను సేకరిస్తున్నారు. సర్వేలకు ఉపాధ్యాయులను వాడుకోవద్దని గతంలో కోర్టు తీర్పులున్నందున విద్యా శాఖలో వేల మంది ఇతర ఉద్యోగులను ఈ సర్వేకు నియమించనున్నారు. ప్రతి ప్రభుత్వ శాఖలో ఎంతమందిని తీసుకోవాలనే దానిపై జిల్లాల వారీగా వివరాలు పంపాలని కలెక్టర్లకు సూచించారు. జీహెచ్ఎంసీలోనే దాదాపు కోటికిపైగా జనాభా ఉన్నందున, ఇక్కడే 30 వేల మందికి పైగా గణకులు అవసరమని భావిస్తున్నారు.
నమూనాగా తనిఖీ సర్వే :కుటుంబాల సంఖ్య ఆధారంగా జిల్లాల్లో కనీసం 2,500 నుంచి 3,000 మంది ఉద్యోగులను అన్ని శాఖల నుంచి సర్వేకు నియమించనున్నారు. వీరంతా 15 రోజుల పాటు ఇంటింటికీ తిరిగి సర్వే చేయాలని నిర్ణయించారు. ఒకసారి సర్వే చేసిన తర్వాత ఆ వివరాలు పక్కాగా సేకరించారా లేదా అనేది తర్వాత నమూనాగా తనిఖీ సర్వే కూడా చేయాలని యోచిస్తున్నారు. ఈ నెలాఖరులోపే సర్వేను ప్రారంభించేందుకు ముమ్మరంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. 60 రోజుల్లోగా ఈ సర్వే నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అందించాలనేదే ప్రణాళిక శాఖ ప్రధాన లక్ష్యం.