Telangana Govt on Solar Power Plants in Crop Fields :పంటల సాగుతోనే కాకుండా వ్యవసాయ భూముల్లో విద్యుత్ ఉత్పత్తితో రైతులు అదనపు ఆదాయాన్ని పొందేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రైతులే సొంతంగా లేదా సహకార, స్వయం సహాయక సంఘం, కంపెనీ భాగస్వామ్యంతో పొలంలో సౌరవిద్యుత్కేంద్రం ఏర్పాటుకు రాష్ట్ర ఇంధనశాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్రంలో ప్రధాన మంత్రి కిసాన్ ఊర్జ సురక్ష ఏవం ఉత్థాన్ మహాభియాన్(పీఎం కుసుమ్) పథకాన్ని అమలు చేసేందుకు కేంద్రం అనుమతిచ్చినట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది.
4 వేల మెగావాట్ల స్థాపిత సామర్థ్యమున్న సౌరవిద్యుత్కేంద్రాలను పొలాల్లో వచ్చే మార్చిలోగా ఏర్పాటు చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. ఈ మేరకు పథకం అమలు కోసం తెలంగాణ రాష్ట్ర పునరుద్ధరణీయ ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ (టీజీరెడ్కో)ను నోడల్ ఏజెన్సీగా నియమించింది. ఈ కరెంట్‌ను కొనేందుకు విద్యుత్ నియంత్రణ మండలి(ఈఆర్‌సీ) నిర్ణీత ధరను నిర్ణయిస్తుంది. లబ్ధిదారులను కేంద్ర నూతన, పునరుద్ధరణీయ ఇంధన వనరుల మంత్రిత్వశాఖ(ఎంఎన్‌ఆర్‌ఈ) జారీచేసి మార్గదర్శకాల ప్రకారం ఎంపిక చేస్తారు. డిస్కంల సమన్వయంతో ఆసక్తిగల రైతుల ఎంపికకు టీజీరెడ్కో దరఖాస్తులను ఆహ్వానించాలని ప్రభుత్వం ఆదేశించింది.
సబ్‌స్టేషన్ల వారీగా :ఏయే ప్రాంతాల్లో సౌరవిద్యుత్కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించడానికి డిస్కంలు సబ్‌స్టేషన్ల వారీగా జాబితా విడుదల చేయాలి. పొలం నుంచి కరెంటును తీసుకునేలా సబ్‌స్టేషన్ వరకూ విద్యుత్ లైను, ఇతర మౌలిక సదుపాయాలను సైతం డిస్కం ఏర్పాటు చేయాలి. ఒక రైతుకు సొంతంగా 10 ఎకరాల పొలం ఉంటే 2 మెగావాట్ల స్థాపిత సామర్థ్యంతో సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేసుకోవచ్చు. ఒక మెగావాట్ కేంద్రం ఏర్పాటుకు దాదాపు రూ. 5 కోట్లు వరకు వ్యయం అవుతుందని అంచనా. ఈ సొమ్మును బ్యాంకుల నుంచి రుణంగా తీసుకోవచ్చు.