Telangana Government Focus on Food Processing :రాష్ట్రంలో ఆహారశుద్ధి రంగం అభివృద్ధిపై ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమకు కేంద్రంగా తెలంగాణ అభివృద్ధి చెందుతోంది. 14 రంగాల్లో ఫుడ్ ప్రాసెసింగ్ ఒకటిగా గుర్తింపు పొందిన నేపథ్యంలో యూనిట్ల స్థాపన కోసం ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ ఔత్సాహికులను ప్రోత్సహిస్తుంది. తాజాగా హైదరాబాద్ రాజేంద్రనగర్ ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో అపెడా(APEDA), ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో ఆహార శుద్ధి ప్రోత్సాహంపై సదస్సు జరిగింది. యూనిట్ల స్థాపన, చేయూత, బ్యాంకింగ్ రుణ సదుపాయాలపై విస్తృతంగా చర్చించారు.
Food Processing Units in State :రాష్ట్రం నుంచి నాబార్డ్(NABARD) సాయంతో రైతు ఉత్పత్తిదారుల సంఘాల ద్వారా మామిడి, చిరుధాన్యాలు, మునగ పొడి, ఇతర ఉత్పత్తులు విదేశాలకు ఎగుమతి చేయడానికి అవకాశాలు ఉన్నాయని అపెడా తెలుగు రాష్ట్రాల ఇన్ఛార్జి ఆర్‌పీ నాయుడు అన్నారు. వ్యవసాయ ఆహార ఉత్పత్తి యూనిట్ల విస్తరణకు ప్రభుత్వం ఇస్తున్న మద్దతు వల్ల ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలో పెట్టుబడులు పెరుగుతున్నాయి. 2014 నుంచి ఫుడ్ ప్రాసెసింగ్ రంగం స్థిర మూల ధనం 6,864 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి, 80 వేల ఉద్యోగ అవకాశాలు కల్పించింది. బియ్యాన్ని విభిన్న ఉత్పత్తులుగా మార్చేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీలు ఏర్పాటు చేయాలని గత ప్రభుత్వం ప్రతిపాదించింది.
యూనిట్ల స్థాపనకు 35 శాతం రాయితీ :వ్యవసాయ ఉత్పత్తులకు విలువ జోడింపు, విస్తరించేందుకు జాతీయ ఫుడ్ ప్రాసెసింగ్ మిషన్‌తో ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ భాగస్వామిగా ఉంది. ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ఉత్పత్తి తయారీ సంస్థల వ్యవస్థీకరణ పథకం - పీఎంఎఫ్‌ఎంఈ(PMFME) కింద అసంఘటిత ఆహార ఉత్పత్తి తయారీ నాణ్యత ప్రమాణాల అభివృద్ధి చేయడమే లక్ష్యంగా సంయుక్తంగా నిర్వహిస్తున్న బృహత్తర పథకం ఇది. ఈ పథకం కింద వ్యవసాయ అనుబంధంగా ఎఫ్‌పీఓలు, ఎస్‌హెచ్‌జీలు(SHG), సహకార సంఘాలకు, ప్రైవేటు లిమిటెడ్ సంస్థలు, వ్యక్తితగతంగా మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపనకు 35 శాతం రాయితీపై 10 లక్షల రూపాయల ఆర్థిక సాయం లభిస్తుంది.