Telangana Govt Exercise To Hike Lands Price 2024 :ప్రత్యేకరాష్ట్రం ఏర్పడిన తర్వాత 2021 జులై 22న అప్పటి ప్రభుత్వం భూములు, భవనాల మార్కెట్ ధరలు పెంచింది. ఎలాంటి కసరత్తు చేయకుండానే అప్పటికే ఉన్న స్లాబ్‌లపై పెంచారు. అదేవిధంగా 4 శాతం ఉన్న స్టాంపులు రిజిస్ట్రేషన్ ఫీజును 5.5 శాతానికి పెంచారు. వ్యవసాయ భూముల ధరలు ఎక్కువ భాగం 100 శాతం, అంతకుమించి పెంచగా, స్థిరాస్తి భూముల ధరలు 50 శాతం, అపార్ట్‌మెంట్ ధరలు 30 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. రిజిస్ట్రేషన్ భూముల, భవనాల మార్కెట్ విలువలు, స్టాంపుడ్యూటీ పెంపు వల్ల రాబడి రెట్టింపునకు మించి వచ్చింది.
Market Value of Lands in Telangana : 2020-21లో రూ.5,243.28 కోట్లుగా ఉన్న ఆదాయం రూ.7,000ల కోట్లకు పైగా అదనంగా పెరిగి 2021-22 ఆర్థిక ఏడాదిలో రూ.12,372.73 కోట్లు వచ్చింది. అనంతరం 2022 ఫిబ్రవరి 1న రెండోసారి వ్యవసాయ భూముల, స్థిరాస్తి స్థలాలు, భవనాల మార్కెట్ ధరలు పెంచారు. ఈసారి స్టాంపుడ్యూటీ జోలికి వెళ్లకుండా భూములు, ఫ్లాట్లు, అపార్ట్‌మెంట్ ధరలు మాత్రమే పెంచారు. వ్యవసాయ భూములపై 50 శాతం, ఫ్లాట్స్‌పై 35 శాతం అపార్ట్‌మెంట్లపై 20 శాతం లెక్కన పెంచారు. తద్వారా సాధారణ వార్షిక ఆదాయం రూ.2500 కోట్ల నుంచి రూ.3,000ల కోట్ల వరకు అదనంగా పెరుగుతుందని అంచనా వేశారు.
Telangana Stamps and Registrations Revenue :వాస్తవానికి 2021-22 ఆర్థిక ఏడాదిలో రూ.12,372.73 కోట్లుగా ఉన్న స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ ఆదాయం ఏకంగా రూ.14,228 కోట్లకు పెరిగింది. దాదాపు రెండు వేల కోట్లు మేర రాబడి అదనంగా పెరిగింది. వాస్తవానికి ప్రతిఏడాది మార్కెట్ ధరలు సమీక్షించి సవరించేందుకు ప్రభుత్వానికి అధికారం ఉంది. కానీ 2022 ఫిబ్రవరి నుంచి ఇప్పటివరకు ఆ ధరలను అమలు చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో ఎలాంటి పరిశీలన లేకుండానే అప్పటికే ఉన్న ధరలపై కొంత శాతం పెంచడంతో ఇబ్బందులు తలెత్తాయి. కమర్షియల్ ప్రాంతాలను గుర్తించడంలో సరైన విధానం పాటించకపోవడం సమస్యలను తెచ్చిపెట్టిందని సర్కార్ భావిస్తోంది.