Telangana Government Decided To Build Tar Roads :తెలంగాణలో గ్రామీణ రహదారులకు మహర్దశ పట్టనుంది. వచ్చే నాలుగు సంవత్సరాల్లో ప్రతి ఊరికి తారు రోడ్డు నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతానికి మట్టి, కంకర రోడ్లు ఉన్నచోట వాటి స్థానంలో నగరాల్లో, పట్టణాల్లో మాదిరిగా పటిష్ఠమైన తారు రోడ్డు నిర్మించనున్నారు. వచ్చే నాలుగేళ్లో రూ.12 వేల కోట్లతో రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో 17,300 కిలోమీటర్ల మేర రోడ్లు నిర్మించేందుకు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రివర్గం ఇటీవల ఆమోదం తెలిపింది.
30టన్నుల సామర్థ్యం :పంచాయతీరాజ్ శాఖ పరిధిలో మొత్తం 68,539 కిలోమీటర్ల రోడ్లు ఉన్నాయి. అందులో 30,493.72 కిలో మీటర్ల మట్టి రోడ్లు, 7,752.10 కి.మీ కంకర, 26,146.83 కి.మీ బీటీ రోడ్లు, 4,146.63 కిలీ మీటర్ల సిమెంట్ కాంక్రీటు ఉన్నాయి. ప్రస్తుతం పంచాయతీరాజ్ రోడ్లను 10 టన్నుల వాహన సామర్థ్యంతో నిర్మిస్తున్నారు. రాష్ట్రంలో ప్రజా రవాణాతో పాటు సరకులు, సామగ్రి సరఫరా వాహనాలు ఇటీవల కాలంలో బాగా పెరిగాయి. గ్రామాల్లో 25 నుంచి 30 మెట్రిక్ టన్నుల బరువు వాహనాలు నడుస్తున్నాయి. అధిక సామర్థ్యంతో కూడిన వాహనాల రాకపోకలతో పంచాయతీ రోడ్లు దెబ్బతింటున్నాయి. మరమ్మతులు చేసినా మళ్లీ గుంతలు ఏర్పడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇకపై 30 టన్నుల సామర్థ్యంతో రోడ్లు నిర్మించనున్నట్లు నిర్ణయించారు.
గత కొన్నేళ్లుగా రాష్ట్రంలో పంచాయతీరాజ్ రహదారుల నిర్వహణ, పునరుద్ధరణ అంతంత మాత్రంగానే జరిగింది. నిధులు తక్కువగా కేటాయించడం, సకాలంలో చెల్లించకపోవడం, బిల్లులు మంజూరు చేయకపోవడం తదితర కారణాలతో చాలా పనులు పెండింగ్‌లో ఉన్నాయి. మరోవైపు ఈ ఏడాది జులై నుంచి సెప్టెంబరు మధ్య కురిసిన భారీ వర్షాలకు జిల్లాల్లో చాలాచోట్ల గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి.