తెలంగాణ

telangana

ETV Bharat / state

259 మందితో హైడ్రా టీమ్! - ఎవరెవరు ఉన్నారంటే? - 259 MEMBERS DEPUTATION TO HYDRA - 259 MEMBERS DEPUTATION TO HYDRA

259 Hydra Staff in Telangana : చెరువులు, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ, విపత్తుల నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైడ్రా మరింత పటిష్ఠంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. కమిషనర్ రంగనాథ్ ఆధ్వర్యంలో ఇప్పటికే చెరువుల ఆక్రమిత స్థలాల్లో నిర్మాణాలను కూల్చివేస్తున్న హైడ్రాకు అదనపు సిబ్బందిని నియమించేందుకు ప్రభుత్వం అంగీకరించింది. మొత్తం 3 వేల 500 మంది సిబ్బందితో పనిచేయబోతున్న హైడ్రాకు డిప్యుటేషన్‌పై 259 మంది పోలీసు బలగాలను కేటాయించాలని పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిషోర్ డీజీపీని కోరారు.

Telangana Govt Allotted Staff to Hydra
TG Govt on Hydra Staff (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Aug 14, 2024, 7:09 AM IST

Updated : Aug 14, 2024, 8:41 AM IST

Telangana Govt Allotted Staff to Hydra :హైదరాబాద్‌లో ప్రభుత్వ స్థలాల పరిరక్షణ, విపత్తుల నిర్వహణ కోసం ఏర్పాటు చేసిన హైడ్రా క్రమంగా బలపడుతోంది. ప్రభుత్వం కూడా హైడ్రాపై ప్రత్యేక దృష్టి సారించి ఆ సంస్థకు కావాల్సిన వనరులన్నీ సమకూర్చేందుకు సిద్ధమైంది. అందులో భాగంగా ఇప్పటికే ఐజీ స్థాయి అధికారి రంగనాథ్‌ను కమిషనర్‌గా నియమించగా విస్తృత అధికారాలు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రత్యేక వ్యవస్థగా హైడ్రా పనిచేయబోతున్నట్లు శాసనసభలో అధికారికంగా ప్రకటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సర్కారు భూములపై కన్ను పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

ఇందుకోసం హైడ్రాకు బడ్జెట్​లో 200 కోట్ల రూపాయలు కేటాయించడమే కాకుండా అవసరమైన మానవ వనరులను సమకూరుస్తామని సీఎం రేవంత్​రెడ్డి వెల్లడించారు. ఈ మేరకు హైడ్రా కమిషనర్ రంగనాథ్, ప్రత్యేక పోలీస్ స్టేషన్‌తోపాటు సిబ్బందికి సంబంధించిన ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపారు. పోలీసు, రెవెన్యూ, నీటిపారుదల శాఖ సహా అన్ని విభాగాల నుంచి డిప్యుటేషన్‌పై సిబ్బందిని కేటాయించాలని కోరారు. హైడ్రా ప్రతిపాదనలను పరిశీలించిన పురపాల శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిషోర్, పోలీసు బలగాలకు సంబంధించిన కేటాయింపులపై డీజీపీకి లేఖ రాశారు.

ప్రత్యేకంగా ఒక పోలీస్ స్టేషన్ : నలుగురు ఎస్పీలు, ఐదుగురు డీసీపీలు, 21 మంది ఇన్​స్పెక్టర్లు, 33 మంది సబ్‌ఇన్‌స్పెక్టర్లు, ఐదుగురు ఆర్ఐలు, 12 మంది ఆర్ఎస్ఐలు, 101 మంది కానిస్టేబుళ్లు, 72 మంది హోంగార్డులు, ముగ్గురు ఎనలైటికల్ ఆఫీసర్లు సహా మరో ముగ్గురు సహాయ ఎనలైటికల్ ఆఫీసర్లను డిప్యుటేషన్‌పై హైడ్రాకు కేటాయించాలని కోరారు. మూడు కమిషనరేటర్ల పరిధిలో హైడ్రా సమర్థంగా పనిచేయాలంటే తగిన సిబ్బంది ఉండాలని సూచించారు.

జీహెచ్ఎంసీతోపాటు ఓఆర్ఆర్ వరకు 2 వేల 50 చదరపు కిలోమీటర్ల పరిధిలో హైడ్రా పనిచేయనున్నట్లు వెల్లడించిన రంగనాథ్, ప్రత్యేకంగా ఒక పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసి ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అంతేకాకుండా ఆక్రమణలపై ఫిర్యాదులను పరిశీలించి క్షేత్రస్థాయిలో విజిలెన్స్ చేసేందుకు కూడా ప్రత్యేక బృందాలను సిద్ధం చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం హైడ్రాకు సిబ్బందిని కేటాయించేందుకు ఆయా విభాగాల్లోని ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేసింది.

ఆక్రమణల అడ్డగింత - చెరువుల పునరుజ్జీవనం - హైడ్రా విధులు ఇవే : కమిషనర్ రంగనాథ్ - WHAT ARE HYDRA RESPONSIBILITIES

హైదరాబాద్‌లో అక్రమాల నివారణకే హైడ్రా : సీఎం రేవంత్‌రెడ్డి - CM Revanth Reddy on HYDRA

Last Updated : Aug 14, 2024, 8:41 AM IST

ABOUT THE AUTHOR

...view details