Free Transport services on December 31st in Hyderabad :నూతన సంవత్సరం సందర్భంగా ఈరోజు రాత్రి హైదరాబాద్‌తో పాటు ఆయా ప్రాంతాల్లో ఉచిత రవాణా సౌకర్యం కల్పించనున్నట్లు తెలంగాణ ఫోర్ వీలర్స్ అసోసియేషన్ వెల్లడించింది. ఈ మేరకు హైదరాబాద్‌తో పాటు సైబరాబాద్, రాచకొండ పరిధిలో ఉచిత రవాణా సౌకర్యం ఉంటుందని తెలిపింది. మీడియాతో సమావేశమైన తెలంగాణ ఫోర్ వీలర్స్ అసోసియేషన్ సభ్యులు, నగరంలో ఈ రోజు రాత్రి ఉచిత రవాణా సౌకర్యం ఉంటుందని తెలిపారు.
ఉచిత రవాణా సౌకర్యం :ఈ సందర్భంగా 500 కార్లు, 250 బైక్ ట్యాక్సీలు అందుబాటులో ఉంటాయని తెలంగాణ ఫోర్ వీలర్స్ అసోసియేషన్ సభ్యులు వివరించారు. ప్రజలు మద్యం మత్తులో వాహనాలు నడపకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అసోసియేషన్ సభ్యులు వెల్లడించారు. రోడ్డు ప్రమాదాలు జరగకూడదని ఫోర్ వీలర్స్ అసోసియేషన్ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
మెట్రో సేవలు పొడిగింపు : కొత్త సంవత్సర వేడుకల సందర్భంగా ప్రయాణికులకు సురక్షితమైన ప్రయాణం కల్పించేందుకు హైదరాబాద్ మెట్రో రైలు ఈరోజు రాత్రి మెట్రో సేవలను పొడిగించింది. ఆంగ్ల నూతన సంవత్సరం సందర్భంగా ఈ సేవలు అందిస్తున్నట్లు తెలిపింది. ఈ రోజు చివరి రైలు అన్ని టెర్మినల్ స్టేషన్‌ల నుంచి అర్ధరాత్రి 12:30 గంటలకు బయలుదేరి దాదాపు 1:15 గంటలకు సంబంధిత ఎండ్ పాయింట్‌లకు చేరుతాయని హెచ్ఎమ్ఆర్ఎల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి రెడ్డి తెలిపారు. ప్రయాణికులకు సురక్షితమైన ప్రయాణం అందించడమే లక్ష్యమని ఆయన తెలిపారు.