Farmers Protest Over Paddy Procurement :రాష్ట్రంలో కురిసిన అకాల వర్షాలకు కొన్ని జిల్లాల్లో పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. మరికొన్ని చోట్ల కల్లాలు, మిల్లులు వద్ద ఉన్న ధాన్యం తడిసిపోవడంతో రైతులు లబోదిబోమంటున్నారు. తాజాగా తడిచిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలంటూ కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలం కొమలంచ గ్రామంలో రైతులు రోడ్జెక్కారు.
గత ఐదు రోజుల నుంచి గ్రామంలో ధాన్యం కొనుగోళ్లు నిలిచిపోయాయని కామారెడ్డి రైతులు నిరసనకు దిగారు. 40 లారీలకు పైగా ధాన్యం ఇంకా కల్లాల్లోనే ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. వడ్లను ఎఫ్‌సీఐ కేంద్రాలకు తరలించి 25 రోజులు గడిచినా ఇంకా తూకం జరగడం లేదని వాపోయారు. అధికారులు వచ్చి తమ సమస్యను పరిష్కరించేంత వరకు కదిలేదంటూ రోడ్డుపై భైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
"గత పదిరోజుల నుంచి కూడా తూకాలు ఆగిపోయాయి. సొసైటీ వాళ్లను అడిగితే రైస్‌మిల్లు ఓనర్లు వద్దు అంటున్నారు మేమేం చేయాలని అంటున్నారు. గత పదేళ్లుగా ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ రాలేదు. గత ఐదు రోజులుగా వర్షాలు పడుతున్నాయి. ధాన్యం తడిసిపోయింది. అయినా ప్రభుత్వం స్పందించలేదు. ఐదు నెలలుగా ఈ ప్రభుత్వం ఏం చేసింది? ఇప్పటికైనా అధికారులు స్పందించి రైతులకు న్యాయం చేయాలి."- రైతులు
Nirmal Crop Loss :అలాగే నిర్మల్ జిల్లా మామడ, లక్ష్మణ చందా మండలాల్లో మంగళవారం రాత్రి కురిసిన అకాల వర్షానికి కల్లాల్లోని ధాన్యం తడిసి ముద్దయిపోయింది. చేతికొచ్చిన పంట వర్షానికి తడిసి ముద్ద కావడంతో మొలకలొచ్చే అవకాశం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం వెంటనే ధాన్యాన్ని కొనుగోలు చేసి ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.