వానొచ్చి పాయే గింజ మొలవదాయే - ఈయేడు వర్షం మూణ్నాళ్ల మురిపెమాయే (ETV Bharat) Telangana Rain Deficit 2024 :ముందుస్తుగా పలకరించి మురిపించిన తొలకరి వానలు అన్నదాతల ఆశలను అడియాశలు చేస్తున్నాయి. చిరుజల్లులను నమ్మి నాటుకున్న విత్తనాలు మండుతున్న ఎండలకు భూమిలోనే మాడిపోతున్నాయి. అడపాదడపా చినుకులే తప్పా ఖరీఫ్ ఉపయోగపడేంత వర్షమే కురవట్లేదు. గతేడాది ఇబ్బందులను మరిచి మలి సాగుకు సన్నద్ధమైన అన్నదాతకు ఆదినుంచే కష్టాలు స్వాగతం పలుకుతున్నాయి.
ఈయేడూ సవాళ్ల సాగేనా? అన్నదాతలకు ఏటా సవాళ్ల సాగు తప్పట్లేదు. ప్రకృతి విపత్తులు, ధరల మాయాజాలానికి విలవిలలాడిన అన్నదాతకు ఈయేడూ కష్టాలు తప్పేలా లేవు. రాష్ట్రంలోనే అత్యధిక వర్షపాతం నమోదయ్యే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇప్పటికీ ఎండ తీవ్రతనే కొనసాగుతోంది. ఖరీఫ్ ఆరంభమై రెండు వారాలు గడుస్తున్నప్పటికీ నైరుతి రుతుపవనాల జాడలేదు. అడపాదడపా అన్నట్లు చిరుజల్లులు తప్పితే భారీ వర్షమే లేదు. ఆశతో విత్తనాలు వేసిన రైతులు కళ్లు కాయలు కాసేలా వానల కోసం నిరీక్షించాల్సి వస్తోంది. విత్తన దశలోనే నష్టం చవిచూడాల్సి వస్తుందనే ఆందోళనతో కాలం వెల్లదీయాల్సి వస్తోంది.
"ప్రతి ఏడాది ఇదే నెలలో పత్తి విత్తనాలు పెట్టేవాళ్లం. ఈ ఏడాది కూడా అదే ఆశతో విత్తనాలు విత్తాం. దేవుడు కూడా రైతులను కనికరిస్తలేడు. దిగుబడి కోసం ముందే పంట వేస్తే వాన దేవుడు కరుణిస్తలేడు. రైతును ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. చివరకు ఆ దేవుడు కూడా చిన్నచూపు చూస్తండు. వర్షాలు లేకపోవడం వల్ల విత్తనాలు మొలకెత్తడం లేదు. నీళ్లు లేక నష్టపోతున్నాం. ఈ ఏడాది భారీ వర్షాలు ఉన్నాయని వాతావరణ నిపుణులు చెప్పిన మాటలు నమ్మి పంట వేశాం. ఇప్పుడేమో నీళ్లు లేక ఇబ్బంది అవుతోంది." - రైతులు
ఆదిలాబాద్ జిల్లాలో భిన్నమైన వాతావరణ పరిస్థితి - వరుణుడి పలకరింపు కోసం ఎదురు చూస్తున్న రైతులు - Farmers waiting for rain In Adilabad
రైతుల్లో కలవరం :ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 16లక్షల ఎకరాల సాగు విస్తీర్ణంలో 12లక్షల ఎకరాల్లో పత్తిసాగవుతోంది. ఇప్పటికే ఆదిలాబాద్, ఆసిఫాబాద్, ఉట్నూర్, బోథ్, నిర్మల్ డివిజన్లలో విత్తనాలు వేసి వరుణుడి పలకరింపు కోసం ఎదురుచూడాల్సి వస్తోంది. ఆదిలాబాద్ జిల్లాలో ఇప్పటికే కురవాల్సిన దాని కంటే 15శాతం లోటు వర్షపాతం నమోదైంది. నిర్మల్ జిల్లాలో 28శాతం, కుమురంభీం జిల్లాలో 10శాతం లోటు వర్షపాతం నమోదైంది. కురిసిన వర్షం సైతం ఎక్కడా పంటలకు ఉపయోగపడేలా లేదు. పైగా వేసిన పత్తి విత్తనం మురిగిపోయే ప్రమాదం కర్షకులను కలవర పరుస్తోంది.
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోనూ వరుణుడి జాడ లేక రైతుకు కష్టాలు తప్పట్లేదు. జూన్ మొదటి వారంలో కురిసిన వర్షాలతో పత్తి గింజలు నాటి రోజులు గడుస్తున్నా ఎండలు మండిపోతున్నాయి. అరకొరగా మొలకెత్తిన గింజలు ఎండిపోతుండగా మిగిలిన గింజలు గుళ్లబారే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాటారం మండలంలోని పలు గ్రామాల రైతులు ట్రాక్టర్‌కు డ్రిప్పింగ్ పరికరాలు అమర్చి పంటను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇదే పరిస్థితి కోనసాగితే తీవ్రంగా నష్టపోతామని అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. మరో రెండు మూడు రోజుల్లో వర్షం కురవనట్లైతే ఎండ తీవ్రతకు విత్తనాలు నేలలోనే మాడిపోయే ప్రమాదం ఉంది. మరోసారి విత్తనం వేసుకోవాల్సిన దుస్థితి నెలకొంది.
రైతన్న దారెటు - ప్రత్యామ్నాయ పంటలసాగుపై వ్యవసాయ శాస్త్రవేత్తల సలహాలు - alternative crops in Telangana
హైదరాబాద్‌లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షం - ఈదురుగాలుల ధాటికి పలుచోట్ల విరిగిపడిన చెట్లు - Heavy Rain in Hyderabad