Telangana DSC Notification 2024 :రాష్ట్రంలో కొలువుల నగారా మోగింది. ఉద్యోగాల కల్పనకు పెద్దపీఠ వేస్తామని ప్రకటించిన రేవంత్ సర్కారు ఆ దిశగా మరో అడుగు ముందుకు వేసింది. పేపర్ లీకేజీ సహా పలు కారణాలతో గతంలో ఇచ్చిన గ్రూప్ 1 నోటిఫికేషన్ రద్దు చేసి అదనపు పోస్టులను కలిపి ఇటీవల 563 పోస్టులతో సర్కారు గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇచ్చిన విషయం తెలిసిందే. తాజాగా 11,062 పోస్టులతో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ (Mega DSC Notification 2024)ను సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేశారు. ముఖ్యమంత్రి నివాసంలో జరిగిన కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు.
నోటిఫికేషన్ వివరాల్లోకి వెళితే మార్చి 4 నుంచి ఏప్రిల్ 2 వరకు అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని నోటిఫికేషన్లో విద్యాశాఖ పేర్కొంది. దరఖాస్తు రుసుము రూ.1000లుగా నిర్ణయించింది. 5,089 పోస్టుల భర్తీకి గతేడాది సెప్టెంబరులో ఇచ్చిన నోటిఫికేషన్ను రద్దు చేసిన విద్యాశాఖ, తాజాగా అదనపు పోస్టులను జత చేస్తూ 11,062 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో గతంలో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు మరోసారి అఫ్లై చేసుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. 2023 జులై 1 నాటికి 18 ఏళ్లు నిండి 46 ఏళ్లలోపు ఉన్నవారు అర్హులని పేర్కొంది. మెగా డీఎస్సీ తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని విద్యాశాఖ స్పష్టం చేసింది. ఆన్లైన్ విధానంలో పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించింది.
గ్రూప్-1 కొత్త నోటిఫికేషన్ విడుదల- దరఖాస్తులు ఎప్పటినుంచంటే?
TS Mega DSC Notification 2024 :మెగా డీఎస్సీ ద్వారా సర్కారు మొత్తం 11,062 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయనుంది. అందులో స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 2,629 కాగా, 727 భాషా పండితులు, 182 పీఈటీ, 6,508 ఎస్జీటీ, ప్రత్యేక కేటగిరి స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 220, ఎస్జీటీ 796 పోస్టులను భర్తీ చేయనుంది. జులై 1వ తేదీ 2023నాటికి 18 ఏళ్లు పూర్తి అయి 46 ఏళ్లు లోపు ఉన్నవారు డీఎస్సీ రాసేందుకు అర్హులని నోటిఫికేషన్లో పేర్కొంది. అభ్యర్థులు మార్చి 4వ తేదీ నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవచ్చని విద్యాశాఖ పేర్కొంది.