Teachers Photos in All Govt Schools in Telangana : రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు, మోడల్, కేజీబీవీలు, తెలంగాణ గురుకుల విద్యాసంస్థల్లో పని చేసే ఉపాధ్యాయుల ఫొటోలను ఇక నుంచి అందరికీ కనిపించేలా ప్రదర్శించాలని పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు, సమగ్ర శిక్ష రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ ఈవీ నరసింహారెడ్డి ఆదేశించారు. కొన్ని పాఠశాలల్లో ఒకరికి బదులు మరొకరు పని చేస్తున్నారని, అందుకు అన్ని రాష్ట్రాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో పని చేసే ఉపాధ్యాయుల ఫొటోలను ప్రదర్శించాలని ఇప్పటికే కేంద్ర విద్యాశాఖ పలుమార్లు ఆదేశించింది. ఈ నేపథ్యంలో పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది.
ఖమ్మం జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో కొందరు సీనియర్ టీచర్లు ఆ గ్రామానికి చెందిన యువతీ యువకులను రూ.10 వేల వరకు ఇచ్చి వారిని బోధకులుగా నియమించినట్లు సమాచారం. హైదరాబాద్‌తోపాటు మరికొన్ని జిల్లాల్లో ఉపాధ్యాయ సంఘాల నేతలకు ఇతర డ్యూటీ సౌకర్యం లేకున్నా పాఠశాలలకు నెలల తరబడి రావడంలేదన్న ఆరోపణలు సైతం ఉన్నాయి. హైదరాబాద్ పాతబస్తీ ప్రాంతంలో పని చేసే కొందరు టీచర్లను విద్యార్థులు గుర్తించే అవకాశమే లేదని అర్థమవుతోంది.