TG Cyber Police Operation in Gujarat :హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు నిందితులను పట్టుకోవడంలో దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే పలు రాష్ట్రాలకు చెందిన నిందితులను అరెస్టు చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు, గుజరాత్ కేంద్రంగా సాగుతున్న మోసాలపై ప్రత్యేక బృందాలుగా ఏర్పడి దాడులు చేసి నిందితులను అరెస్టు చేశారు. ప్రధానంగా ఇన్వెస్ట్‌మెంట్, ట్రేడింగ్, ఫెడెక్స్ మోసాలకు పాల్పడుతున్న 36 మందిని అరెస్టు చేశారు. వీరిపై దేశవ్యాప్తంగా వెయ్యికిపైగా కేసులు ఉన్నాయని హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు.
పెద్దఎత్తున మోసం :ఫెడెక్స్ కొరియర్ పేరుతో సికింద్రాబాద్‌కు చెందిన ఓ విశ్రాంత వైద్యురాలు 1.6 కోట్ల రూపాయలు పోగొట్టుకున్నారని సీపీ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. అలాగే ఇన్వెస్ట్‌మెంట్ కేసులో రాంకోఠికి చెందిన ఓ వ్యాపారి 2 కోట్ల రూపాయలను నష్టపోయారని సీపీ తెలిపారు. ట్రేడింగ్ కేసుకు సంబంధించి, బేగంపేటకు చెందిన విశ్రాంత ఉద్యోగి 61 లక్షల రూపాయలు పోగొట్టుకున్నారని సీపీ వెల్లడించారు.
20 సైబర్ కేసులకు సంబధించి బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టి నిందితులను అరెస్టు చేశామని శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. ముఖ్యంగా ట్రేడింగ్ కేసుకు సంబంధించి అరెస్టు అయిన నిందితుల్లో, సీఏ సైతం ఉన్నాడని సీపీ వివరించారు. ప్రస్తుతం 20 కేసుల్లో, నిందితులు 12 కోట్ల రూపాయలకు పైగా అమాయకుల నుంచి దోచుకున్నారని హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి వెల్లడించారు. ఈ డబ్బులో గతంలో 4.4 కోట్ల రూపాయలు ఫ్రీజ్ చేశామన్న ఆయన, ఆ మొత్తంలో కోటిన్నర రూపాయలను బాధితులకు రిఫండ్ చేశామని వివరించారు. చదువుకున్న వారు సైతం సైబర్ క్రైమ్ మోసాలకు గురికావడంపై హైదరాద్ సీపీ శ్రీనివాస్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. అత్యాశకు పోకుండా తెలివిగా ప్రజలు వ్యవహరించాలని సీపీ సూచించారు.