CM Revanth with Foxconn Chairman Young Liu at Delhi :ఇండస్ట్రీ, సర్వీస్ సెక్టార్లతోపాటు అన్ని రంగాల్లో విస్తరించే సత్తా హైదరాబాద్ నగరానికి ఉందని అంతర్జాతీయ దిగ్గజ పారిశ్రామిక సంస్థ ఫాక్స్‌కాన్ ఛైర్మన్ యాంగ్ లియూ అన్నారు. ఫాక్స్‌కాన్ ఛైర్మన్ యాంగ్ లియూ నేతృత్వంలోని ఆ కంపెనీ ప్రతినిధి బృందం దిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఆయన అధికారిక నివాసంలో శుక్రవారం ఉదయం సమావేశమైంది. హైదరాబాద్ చరిత్ర, పారిశ్రామిక సంస్థల విస్తరణకు ఉన్న అనుకూలతను సీఎం రేవంత్‌రెడ్డి ఫాక్స్‌కాన్ బృందానికి వివరించారు. 430 ఏళ్ల కింద పునాదిరాయి పడిన హైదరాబాద్ కాలక్రమంలో మూడు నగరాలుగా అభివృద్ధి చెందిన తీరును తెలిపారు. ప్రభుత్వాలు మారినా పారిశ్రామిక అభివృద్ధిలో వైరుధ్యాలు లేకపోవడంతోనే హైదరాబాద్ వేగంగా పురోగతి చెందుతోందన్నారు.
అంతర్జాతీయ విమానాశ్రయం, ఔటర్ రింగు రోడ్డు, రీజినల్ రింగురోడ్డుతోపాటు హైదరాబాద్‌కు ఉన్న అన్ని అనుకూలతలను ఉన్నాయని రేవంత్‌రెడ్డి ఫాక్స్‌కాన్ ప్రతినిధులకు వివరించారు. హైదరాబాద్ అభివృద్ధిని మరింతగా పరుగులు పెట్టించేందుకు, భవిష్యత్ అవసరాలకు తగినట్లు ఫ్యూచర్ సిటీ పేరుతో నాలుగో నగరాన్ని నిర్మిస్తున్నట్లు రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ఫోర్త్ సిటీలో విద్య, వైద్యం, క్రీడ, ఎలక్ట్రానిక్స్-ఎలక్ట్రికల్, స్కిల్ డెవలప్‌మెంట్ విభాగాల్లో బహుముఖంగా అభివృద్ధి చేయనున్నామని చెప్పారు. ప్రస్తుత ప్రపంచానికి అవసరమైన నైపుణ్యాలను యువతకు అందించేందుకు యంగ్ ఇండియా స్కిల్ డెవలప్‌మెంట్ యూనివర్సిటీని ప్రారంభిస్తున్నామన్నారు.