Telangana Budget 2024 : రానున్న ఆర్థిక సంవత్సరానికి వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన రాష్ట్ర ప్రభుత్వం, 2022-23లో చేసిన వ్యయం రూ.2,04,523 కోట్లుగా పేర్కొంది. 2023-24 బడ్జెట్ అంచనాలను రూ.2,90,296 కోట్ల నుంచి రూ.2,24,625 కోట్లకు సవరించారు. రూ.65,000ల కోట్లకు పైగా మొత్తాన్ని దాదాపు 23 శాతం మేర తగ్గిస్తూ సవరణ పద్దు ప్రవేశపెట్టారు. సవరించిన బడ్జెట్‌పై (TS Budget 2024) దాదాపుగా అంతే శాతాన్ని పెంచి 2024-25 బడ్జెట్‌ను ప్రతిపాదించారు. రూ.51,000ల కోట్లకు పైగా మొత్తాన్ని పెంచి రూ.2,75,891 కోట్లతో పద్దును ఖరారు చేశారు.
Telangana Vote on Account Budget 2024 :ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పన్ను ఆదాయాన్ని రూ.1,18,195 కోట్లకు సవరించి, రానున్న ఏడాది రూ.1,38,228 కోట్లు పన్నుల రూపంలో వస్తాయని అంచనా వేశారు. సీజీఎస్టీ ద్వారా రూ.7,838 కోట్లు, ఎస్జీఎస్టీ ద్వారా రూ.50,762 కోట్లు వస్తాయని ప్రతిపాదించారు. కార్పొరేషన్ పన్నుల ద్వారా రాష్ట్రానికి రూ.8051 కోట్లు, కార్పొరేషన్ మినహా ఇతర ఆదాయంపై పన్ను రూ.8872 కోట్లు రానున్నట్లు అంచనా వేశారు. ఇతర ఆదాయాలపై పన్నుల ద్వారా మరో రూ.900 కోట్లు వస్తాయని భావిస్తున్నారు.
రూ.2.75 లక్షల కోట్లతో తెలంగాణ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ - ఏ శాఖకు ఎంతంటే?
స్టాంపులు - రిజిస్ట్రేషన్ల ద్వారా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.18,500 కోట్లు ప్రతిపాదించిన ప్రభుత్వం, ఆ మొత్తాన్ని రూ.15,000ల కోట్లకు సవరించింది. 2024-25లో మళ్లీ రూ.18,228 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేసింది. రాష్ట్ర ఎక్సైజ్ పన్నుల ద్వారా ప్రస్తుత సంవత్సరంలో రూ19,884 కోట్ల ఆదాయం చూపగా, వచ్చే ఏడాదికి ఆ మొత్తాన్ని రూ.25,617 కోట్లుగా ప్రతిపాదించారు. అమ్మకం పన్ను ద్వారా 2023-24లో రూ.39,500ల కోట్లు వస్తాయని మొదట అంచనా వేశారు. ఆశించిన మేర రాబడులు లేకపోవడంతో ఆ మొత్తాన్ని రూ.34,166 కోట్లకు సవరించారు. రానున్న ఆర్థిక సంవత్సరంలో ఇంకాస్త తగ్గించి రూ.33,449 కోట్లు మాత్రమే ప్రతిపాదించారు.
Telangana Budget Sessions 2024 : వాహనాలపై పన్ను ద్వారా రూ.8477 కోట్లు వస్తాయని అంచనా వేశారు. కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటాగా ఈ ఏడాది రూ.25,639 కోట్లు వస్తాయని పేర్కొన్నారు. పన్నేతర ఆదాయాన్ని రూ.20,658 కోట్లుగా అంచనా వేశారు. మైనింగ్ ద్వారా రూ.6587 కోట్లు వస్తాయని అంచనా వేసిన ప్రభుత్వం, ఇతర సాధారణ సర్వీసుల కింద రూ.11,320 కోట్లను పేర్కొంది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేంద్రం నుంచి భారీగా గ్రాంట్లను ఆశించిన రాష్ట్ర ప్రభుత్వం, ఏకంగా రూ.41,259 కోట్లు ప్రతిపాదించింది. అయితే ఈ ఏడాది గ్రాంట్లు చాలా తక్కువగా వచ్చినందున ఆ మొత్తాన్ని ఏకంగా రూ.13,953 కోట్లకు కుదించారు. రానున్న సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రాంట్ల రూపంలో రూ.21,075 కోట్లు వస్తాయని బడ్జెట్‌లో పేర్కొన్నారు. ఈ గ్రాంట్లలో ఆర్థిక సంఘం నిధులతో పాటు జాతీయ ఆరోగ్య పథకం నుంచి వచ్చే నిధులు సహా కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాల నిధులు ఉన్నాయి.
తెలంగాణ సర్కార్ వాటా జమ చేయకపోవడంతో గత కొన్నేళ్లుగా కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాల నుంచి వచ్చే నిధులు రాష్ట్రానికి చాలా తక్కువగా వస్తున్నాయి. అయితే ఈ విషయంలో కొత్త ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. కేంద్ర ప్రాయోజిత పథకాలను పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని అవసరమైన రాష్ట్ర వాటా చెల్లించి వీలైనంత ఎక్కువగా కేంద్రం నుంచి నిధులు రాబట్టుకోవాలని సీఎం ఆదేశించారు. అందుకనుగుణంగా గ్రాంట్ల మొత్తాన్ని ఎక్కువగా ప్రతిపాదించారు.