Telangana Budget 2024 : తెలంగాణలో కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న శాసనసభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, శాసనసమండలిలో మంత్రి శ్రీధర్ బాబు 2024-25 ఆర్థిక సంవత్సరానికి రూ.2,75,891 కోట్లతో ఓటాన్ అకౌంట్ పద్దును ప్రవేశపెట్టారు.
Telangana Vote On Account Budget 2024 :మార్పును కోరుతూ తెలంగాణ ప్రజలు స్వేచ్ఛను సాధించుకున్న ప్రజలకు మనస్ఫూర్తిగా భట్టి విక్రమార్క కృతజ్ఞతలు తెలిపారు. సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని అందించే స్ఫూర్తితో బడ్జెట్ ప్రవేశపెట్టినట్లు చెప్పారు. తెలంగాణ త్యాగమూర్తులు ఏ ఆశయాలతో ఆత్మార్పణ చేశారో వాటిని ఆచరణలోకి తీసుకొస్తామని హామీ ఇచ్చారు. అందరికోసం స్ఫూర్తితో పాలన అందిస్తున్నామని తెలిపారు.
ఆరు గ్యారంటీలకే బడ్జెట్లో పెద్దపీట - మొత్తం ఎన్ని నిధులు కేటాయించారో తెలుసా?
పదేళ్ల తర్వాత నిజమైన ప్రజాస్వామ్యం ఏంటో తెలంగాణ చూస్తోందని పేర్కొన్నారు. రైతులు, మహిళలు, నిరుపేదల జీవితాల్లో వెలుగులు నింపేందుకు చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. ప్రజలకు నిజమైన ప్రతినిధులుగా ఎంతటి త్యాగాలకైనా సిద్ధంగా ఉన్నామని ఉద్ఘాటించారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు ఈ ప్రభుత్వం ఎంతటి సాహసమైనా చేస్తుందని తెలిపారు. నిస్సహాయులకు సహాయం చేయడమే తమ లక్ష్యమని వివరించారు.
శాఖల వారీగా తెలంగాణ బడ్జెట్ కేటాయింపులు
- రూ.2,75,891 కోట్లతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్
- ఆరు గ్యారంటీల కోసం రూ.53196 కోట్లు అంచనా
- పరిశ్రమల శాఖ రూ.2543 కోట్లు
- ఐటీ శాఖకు రూ.774కోట్లు
- పంచాయతీ రాజ్ రూ.40,080 కోట్లు
- పురపాలక శాఖకు రూ.11692 కోట్లు
- మూసీ రివర్ ఫ్రంట్‌కు రూ.1000 కోట్లు
- వ్యవసాయ శాఖ రూ.19746 కోట్లు
- ఎస్సీ, ఎస్టీ గురుకుల భవన నిర్మాణాల కోసం రూ.1250కోట్లు
- ఎస్సీ సంక్షేమం రూ.21874 కోట్లు
- ఎస్టీ సంక్షేమం రూ.13013 కోట్లు
- మైనార్టీ సంక్షేమం రూ.2262 కోట్లు
- బీసీ గురుకుల భవనాల నిర్మాణం కోసం రూ.1546 కోట్లు
- బీసీ సంక్షేమం రూ.8 వేల కోట్లు
- విద్యా రంగానికి రూ.21389కోట్లు
- తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటుకు రూ.500 కోట్లు
- యూనివర్సిటీల్లో సదుపాయాలకు రూ.500 కోట్లు
- వైద్య రంగానికి రూ.11500 కోట్లు
- గృహజ్యోతికి రూ.2418 కోట్లు
- విద్యుత్ సంస్థలకు రూ.16825 కోట్లు
- గృహనిర్మాణానికి రూ.7740 కోట్లు
- నీటి పారుదల శాఖకు రూ.28024 కోట్లు
"దావోస్ పర్యటన ద్వారా రాష్ట్రానికి రూ.40 వేల కోట్లు పెట్టుబడులు రానున్నాయి. పీఎం మిత్ర నిధులతో కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కు మరింత అభివృద్ధి చేస్తాం. ప్రభుత్వం నుంచి రెండు లెదర్ పార్కులు, రాష్ట్రం నలుమూలలా ఫార్మా క్లస్టర్లు ఏర్పాటు చేస్తాం. డ్రైపోర్టులను అందుబాటులోకి తెచ్చేందుకు బృహత్ ప్రణాళిక రచిస్తున్నాం. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి కృత్రిమ మేథ ఉపయోగిస్తాం. ఐటీని రాష్ట్ర నలుమూలలకు విస్తరించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నాం. దేశంలోనే అత్యంత పటిష్ఠమైన ఫైబర్ నెట్‌వర్క్ కనెక్షన్లు ఉండేలా రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతాం." - భట్టి విక్రమార్క, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి