Telangana Budget 2024 :రాష్ట్ర బడ్జెట్ ఇవాళ ఉభయసభల ముందుకు రానుంది. 2024-25 ఆర్థిక సంవత్సరం కోసం వార్షిక ప్రణాళికను తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ఆర్థిక శాఖ బాధ్యతలు చూస్తున్న ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క శాసనసభలో, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు మండలిలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. లోక్‌సభ ఎన్నికల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టింది. అదే తరహాలో రాష్ట్రంలోనూ ప్రవేశపెట్టనున్నారు.
Telangana Budget 2024-25 :2024-25 ఆర్థిక సంవత్సరం కోసం బడ్జెట్ అంచనాలతో పాటు, 2022-23 సంవత్సరానికి (Telangana Budget 2023) చెందిన లెక్కలు, 2023-24 ఆర్థిక సంవత్సరం సవరించిన బడ్జెట్ అంచనాలు కూడా వెల్లడి కానున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క దిశానిర్దేశానికి అనుగుణంగా పద్దు ప్రతిపాదనలు రూపొందించారు. లేని గొప్పలు వద్దని, వాస్తవాలకు అనుగుణంగా బడ్జెట్ ప్రతిపాదనలు ఉండాలని సీఎం గతంలోనే అధికారులకు స్పష్టం చేసిన ప్రకారమే 2024-25 బడ్జెట్ రానుంది.
రుణాల చెల్లింపులకే రూ.16 వేల కోట్లు - నీటి పారుదల ప్రాజెక్టులకు మరిన్ని నిధులు అవసరం
ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి కేసీఆర్ సర్కార్ రూ.2.90 లక్షల కోట్లకు పైగా బడ్జెట్ తీసుకొచ్చింది. అందులో డిసెంబర్ నెలాఖరు వరకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన వ్యయం మొత్తం రూ.1.56,000ల కోట్లకు పైగా ఉంది. పన్ను ఆదాయం లక్ష కోట్ల వరకు, రెవెన్యూ రాబడులు లక్షా పాతిక వేల కోట్లు ఖజానాకు సమకూరాయి. 2022-23 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఖర్చు రూ.2 లక్షల కోట్లను దాటింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మరో రూ.30,000ల కోట్ల వరకు పెరగవచ్చని భావిస్తున్నారు.
వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని 2024-25 వార్షిక బడ్జెట్‌ను ఖరారు చేయనున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పన్ను ఆదాయం బాగానే ఉన్నప్పటికీ, కొన్ని విభాగాల్లో అంచనాలకు దూరంగానే ఉన్న పరిస్థితి ఉంది. కేంద్రం నుంచి వస్తాయన్న ఆశతో భారీగా అంచనా వేసిన గ్రాంట్లు కూడా చాలా స్వల్పంగానే వచ్చాయి. రుణాల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం గతంలోనే తన వైఖరిని స్పష్టం చేసింది. ప్రత్యేకించి కార్పొరేషన్ల ద్వారా తీసుకునే అప్పుల విషయంలో వ్యతిరేక ధోరణితో ఉన్నారు.
Vote on Account Budget Telangana 2024 : ఈ అంశాలన్నీ దృష్టిలో ఉంచుకొని తాజా బడ్జెట్ రానుంది. ప్రస్తుత పద్దు అంచనా కంటే స్వల్పంగా పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరం బడ్జెట్ రూ.2.90 లక్షల కోట్లు కాగా, రానున్న ఆర్థిక సంవత్సరానికి కాస్త పెరిగి రూ.2.95 లక్షల కోట్ల నుంచి రూ.3 లక్షల కోట్ల మధ్య ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.