Telangana Speaker Complaint Against ENC for Not Follow Protocol : వికారాబాద్ జిల్లాలోని కోటిపల్లివాగు ప్రాజెక్టు మరమ్మతులు, ఆధునికీకరణ అంచనాల వ్యవహారం మరో మలుపు తిరిగింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి చర్చించేందుకు ఇంజినీర్ ఇన్ చీఫ్‌కు ఫోన్ చేస్తే స్పందించలేదంటూ శాసనసభ సభాపతి గడ్డం ప్రసాద్‌కుమార్ గత నెలలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారికి లేఖ రాశారు. ప్రొటోకాల్ నిబంధనలు అనుసరించి స్పందించని ఈఎన్సీపై చర్యలు తీసుకోవాలని లేఖలో కోరారు. దీనిపై వివరణ కోరుతూ, సీఎస్ నుంచి నీటి పారుదల శాఖకు తాజాగా లేఖ అందినట్లు సమాచారం. దీంతో ఈ విషయం అటు ప్రభుత్వంలో, ఇటు నీటి పారుదల శాఖలో చర్చనీయాంశంగా మారింది.
అసలు ఏం జరిగిందంటే? : వికారాబాద్ జిల్లాలో కోటిపల్లివాగును 1967లో నిర్మించారు. దీని కింద 10 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. ఇప్పటి వరకు పూర్తిస్థాయి మరమ్మతులు చేపట్టలేదు. కట్ట, కాలువలు, తూములు, డిస్ట్రిబ్యూటరీలు దెబ్బతిన్నాయి. 2023లో అప్పటి తాండూరు ఎమ్మెల్యే ఈ ప్రాజెక్టుకు ఆధునికీకరణ చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరగా, రూ.100 కోట్లతో నీటి పారుదల శాఖకు ప్రతిపాదనలను అధికారులు అందించారు. దీనిపై నాటి ఈఎన్సీ మురళీధర్ మరోమారు పరిశీలన (ప్రభుత్వ సలహాదారుతో) చేయించి రూ.37.50 కోట్లకు ప్రతిపాదనలు ఖరారు చేసి ప్రభుత్వానికి పంపారు.
ఇంజినీర్లందరూ జూన్ 25 లోపు అఫిడవిట్ సమర్పించాలని చెప్పాం : జస్టిస్ పీసీ ఘోష్ - Kaleshwaram Judicial Commission
Kotipalliwagu project in Telangana: అధికారులు పంపిన ప్రతిపాదనలు దస్త్రం ఆర్థిక శాఖ వద్ద పెండింగ్‌లో ఉండగా, రాష్ట్రంలో ప్రభుత్వం మారింది. ఈ క్రమంలో ప్రాజెక్టు ఆధునికీకరణలో భాగంగా కాలువల సీసీ లైనింగ్, పూడికతీత, ఇతర పనులు కలిపి మొత్తం రూ.110 కోట్లు మంజూరు చేయాలంటూ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ ప్రభుత్వానికి లేఖ రాశారు. హైదరాబాద్ సీఈ అంతే మొత్తానికి ప్రతిపాదనలు సిద్ధం చేసి పంపగా, దస్త్రాన్ని పరిశీలించిన ఈఎన్సీ అనిల్‌కుమార్ పూడిక తొలగింపు, సీసీ లైనింగ్ పనులను తొలగించి రూ.64.20 కోట్లకు ప్రతిపాదనలు ప్రభుత్వానికి సమర్పించారు. క్షేత్రస్థాయి, సాంకేతిక పరిశీలనలు లేకుండానే ప్రతిపాదనలు రూపొందించారని ఇంజినీర్లకు మెమో ఇచ్చారు.
ఈఎన్సీపై చర్యలు తీసుకోండి: ప్రాజెక్ట్ పనుల తొలగింపుపై స్పీకర్ సీఎస్‌కు లేఖ రాశారు. కోటిపల్లివాగు ప్రాజెక్టు నిల్వ సామర్థ్యం 1.50 టీఎంసీల నుంచి ఒక టీఎంసీకి పడిపోయిందని హైడ్రోగ్రాఫిక్ సర్వే నివేదిక (ఏపీఈఆర్‌ఎల్)- 2009 తెలిపింది. దీనివల్ల ఆయకట్టుకు సాగునీరు అందడం లేదు. సీసీ లైనింగ్ దెబ్బతింది. ప్రతిపాదించిన పనులు ఎందుకు తీసివేశారని తెలుసుకునేందుకు ఈఎన్సీకి ఐదారుసార్లు ఫోన్ చేసినా స్పందించలేదని రాష్ట్ర స్పీకర్ తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రొటోకాల్ నిబంధనలు అనుసరించి ఈఎన్సీపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.
రూ.8 వేల కోట్లు ఖర్చు పెట్టి ఒక్క ఎకరానికి నీరు ఇవ్వలేదు - గత ప్రభుత్వంపై మంత్రులు సీరియస్ - Ministers Visits Sitarama Project