6.42 PM
మధ్యాహ్నం 12 గంటలకు బడ్జెట్
గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానానికి శాసనసభ ఆమోదం తెలిపింది. ఈ క్రమంలో శాససనభను రేపటికి వాయిదా వేస్తూ స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు. రేపు మధ్యాహ్నం 12 గంటలకు అసెంబ్లీలో బడ్జెట్.
4.38 PM
సీఎంవోలో మైనార్టీ ఐఏఎస్‌కు కీలక బాధ్యతలు : సీఎం రేవంత్ రెడ్డి
ప్రభుత్వ శాఖల్లో బంధువులను పెట్టుకుని ఉద్యోగాలు అమ్ముకునే వాళ్లం కాదని సీఎం రేవంత్ రెడ్డి విమర్శలు చేశారు. ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయాలంటే నిర్ధిష్ట విధానం ఉంటుందన్నారు. ప్రభుత్వ పరిపాలనలో మైనార్టీలకు సముచిత స్థానం ఇస్తున్నామని చెప్పారు. సీఎంవోలో మైనార్టీ ఐఏఎస్‌లకు కీలక బాధ్యతలు అప్పగించామని తెలిపారు. మైనార్టీకి ఎమ్మెల్సీ అవకాశం ఇస్తే అడ్డుకున్నారన్నారు.
4.35 PM
గ్రూప్-1 వయోపరిమితి 46 ఏళ్లకు పెంపు : సీఎం రేవంత్ రెడ్డి
ఈ ప్రభుత్వం 15 రోజుల్లో పోలీసు ఉద్యోగాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. త్వరలోనే గ్రూప్-1 నోటిఫికేషన్ ఇస్తున్నట్లు చెప్పారు. గ్రూప్ -1 వయోపరిమితిని 46 ఏళ్లకు పెంచి పరీక్ష నిర్వహిస్తామన్నారు. కొన్ని నిబంధనల వల్ల టీఎస్పీఎస్సీ ప్రక్షాళన ఆలస్యం అయిందని సీఎం స్పష్టం చేశారు. జెరాక్స్ సెంటర్లలో ప్రశ్నపత్రాలు విక్రయించి ఉద్యోగాలు భర్తీ చేసేవాళ్లం కాదని అన్నారు.
4.29 PM
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వల్ల క్రమంగా ఆదాయం పెరుగుతోంది : సీఎం రేవంత్ రెడ్డి
మహిళలకు ఉచిత ప్రయాణం వల్ల క్రమంగా ఆదాయం పెరుగుతోందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మహిళలకు ఉచిత ప్రయాణం వల్ల ప్రముఖంగా దేవాదాయ శాఖ ఆదాయం పెరుగుతోందని అన్నారు.
4.26 PM
కొందరు నేతలు ఆటోలు కెమెరాలు పెట్టుకుని నటన ప్రదర్శిస్తున్నారు : సీఎం రేవంత్
మహిళలకు ఉచిత రవాణా సదుపాయం కల్పిస్తే విమర్శలు చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి విపక్ష నేతలపై మండిపడ్డారు. మహిళలకు ఉచిత ప్రయాణం వల్ల ఆటో డ్రైవర్లు నష్టపోతున్నారని రెచ్చగొడుతున్నారు. గత ప్రభుత్వం మహిళలను ఎన్నో రకాలుగా అవమానించిందన్నారు. మొదటిసారి ఏర్పడిన నాటి టీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క మహిళకు కూడా మంత్రి పదవి ఇవ్వలేదన్నారు. కానీ ఈ ప్రభుత్వం తొలిసారే ఇద్దరు మహిళలకు మంత్రి పదవులు ఇచ్చిందని తెలిపారు. కొందరు నేతలు ఆటోలో కెమెరాలు పెట్టుకుని నటన ప్రదర్శిస్తున్నారని ఎద్దేవా చేశారు.
4.21 PM
ప్రభుత్వం ఏర్పడి రెండు నెలలు కాకుండానే రైతు బంధు ఇవ్వలేదని గొడవ : సీఎం రేవంత్ రెడ్డి
గత ప్రభుత్వం 2018- 19లో యాసంగి రైతుబంధును పూర్తి చేయడానికి ఐదు నెలలు తీసుకున్నారని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. 2019-20లో రైతుబంధు పూర్తి చేసేందుకు 9 నెలలు పట్టిందన్నారు. 2020-21లో రైతుబంధు పూర్తి చేసేందుకు 4 నెలలు పట్టిందని తెలిపారు. ఈ ప్రభుత్వం వచ్చి రెండు నెలలు కాకుండానే రైతుబంధు ఇవ్వలేదని రైతులను రెచ్చగొడుతున్నారని బీఆర్ఎస్ నేతలపై మండిపడ్డారు.
4.17 PM
ఒకటో తేదీన ఉద్యోగులకు జీతాలు ఇచ్చాము : సీఎం రేవంత్ రెడ్డి
ప్రజలు ఇబ్బందులు పడితే బాగుండని విపక్షం కోరుకుంటోందని సీఎం రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. పిల్లి శాపనార్థాలకు ఉట్టి తెగిపడదని సామెతను విసిరారు. ఒకటో తేదీన ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని స్థితికి రాష్ట్రాన్ని దిగజార్చారని గత ప్రభుత్వంపై విమర్శలు చేశారు. పరిస్థితిని చక్కదిద్దుతూ ఈ ప్రభుత్వం ఒకటో తేదీన ఉద్యోగులకు జీతాలు ఇచ్చిందన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనర్లకు ఈ నెల 1వ తేదీన జీతాలు ఇచ్చామని హర్షం వ్యక్తం చేశారు. మంచి పనులకు అభినందించే సద్బుద్ధి కూడా విపక్షాలకు లేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
4.13 PM
జయజయహే గీతం తెలంగాణ ఉద్యమంలో అందరికీ స్ఫూర్తినిచ్చింది : సీఎం రేవంత్ రెడ్డి
అందెశ్రీ అనే కవి తెలంగాణకు గొప్ప గీతాన్ని అందించారని సీఎం చెప్పారు. జయజయహే గీతం తెలంగాణ ఉద్యమంలో అందరికీ స్ఫూర్తినిచ్చిందన్నారు. రాష్ట్రం వచ్చాక జయజయహే తెలంగాణ పాట రాష్ట్ర గీతం అవుతుందని ఆశించారన్నారు. కానీ తెలంగాణ వచ్చాక జయజయహే తెలంగాణ పాటను నిషేధించినంత పని చేశారని మండిపడ్డారు. జయజయహే తెలంగాణ పాటను రాష్ట్ర గీతంగా ఆమోదించే నిర్ణయాన్ని విపక్ష నేత అభినందిస్తారని అనుకున్నా ప్రధాన విపక్ష నేత సీటు ఖాళీగా ఉండటం సభకు శోభనీయం కాదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
4.06 PM
రాష్ట్ర అధికారిక చిహ్నంలో రాచరిక ఆనవాళ్లు ఉన్నాయి : సీఎం రేవంత్ రెడ్డి
రాష్ట్ర అధికారికి చిహ్నంలో రాచరిక ఆనవాళ్లు ఉన్నాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో అందరం టీజీ అని రాసుకునేవాళ్లమని గుర్తు చేశారు. కొందరు యువకులు వారి గుండెలపై టీజీ అని పచ్చబొట్టు వేయించుకున్నారన్నారు. ఉద్యమం సమయంలో వాహనాలపై, బోర్డులపైన అందరం టీజీ అనే రాసుకున్నామని చెప్పారు. కేంద్రం కూడా వారి నోటిఫికేషన్లో టీజీ అని పేర్కొందని సీఎం తెలిపారు. కానీ అందరి ఆకాంక్షలకు విరుద్ధంగా గత ప్రభుత్వం తమ పార్టీ పేరు స్పరించేలా టీఎస్ అని పెట్టిందని మండిపడ్డారు.
12: 42 PM
ఒకటో తారీఖున జీతాలు ఇవ్వడమే ప్రభుత్వ విజయం కాదు: పాయల్ శంకర్
గవర్నర్ ప్రసంగంలో హామీలు ఎలా అమలుచేస్తారో చెబితే బాగుండేదని పాయల్ శంకర్ అన్నారు. గతంలో ఉద్యోగాలకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉండేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకటో తారీఖున జీతాలు ఇవ్వడమే ప్రభుత్వ విజయం కాదని చెప్పారు. ఆరు గ్యారంటీలే తప్ప మిగతా గ్యారంటీలకు హామీ ఎవరిస్తారని ప్రశ్నించారు. మిగతా హామీలు ఎప్పటిలోగా ఇస్తారో గవర్నర్ ప్రసంగంలో చెబితే బాగుండేదని అభిప్రాయం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి ఉన్న అప్పులెన్నో ప్రస్తావిస్తే బాగుండేదిని తెలిపారు.
12: 36 PM
తెలంగాణ ఏర్పాటుకు సహకరించిన బీజేపీని విస్మరించారు: పాయల్ శంకర్
తెలంగాణ ఏర్పాటుకు సహకరించిన వాళ్లను గుర్తుచేసుకోవడం మంచిదని పాయల్ శంకర్ అన్నారు. గవర్నర్ ప్రసంగంలో మన్మోహన్, సోనియాను గుర్తు చేసుకున్నారని అన్నారు. తెలంగాణ ఏర్పాటుకు సహకరించిన బీజేపీని విస్మరించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదంతా ప్రభుత్వ సంకుచిత స్వభావానికి నిదర్శనమని అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మాత్రం సీఎంలా చురుగ్గా లేదని చెప్పారు.
12: 26 PM
గవర్నర్ ప్రసంగం రాష్ట్ర భవిష్యత్తును సూచిస్తుంది : ఎమ్మెల్యే పాయల్ శంకర్
గవర్నర్ ప్రసంగం రాష్ట్ర భవిష్యత్తును సూచిస్తుందని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. గవర్నర్ ప్రసంగంలో కొన్ని హామీలనే ప్రస్తావించారని తెలిపారు. ఆరు గ్యారంటీలు తప్ప మరేమీ పట్టించుకోం అనేలా గవర్నర్ ప్రసంగం ఉందని విమర్శించారు. గవర్నర్ ప్రసంగంలో సుష్మా స్వరాజ్ గురించి ఒక్కమాట చెప్పలేదని నిరుత్సాహం వ్యక్తం చేశారు. ఆరోగ్యశ్రీ పరిధి రూ.10 లక్షలకు పెంచారని తెలిపారు. ప్రభుత్వం చెప్పినట్లు ఆరోగ్యశ్రీ అమలుకు నోచుకోలేదని ఆరోపించారు. ఆరోగ్యశ్రీలో 60 వేల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని పేర్కొన్నారు. ఆరోగ్యశ్రీ బాధితులు ఎమ్మెల్యేల చుట్టూ తిరుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
12: 24 PM
సీఎంను మార్చేందుకు మాకు ఎవరి అనుమతీ అక్కర్లేదు: పోచారం
సీఎంను మార్చేందుకు తమకు ఎవరి అనుమతీ అక్కర్లేదని పోచారం శ్రీనివాస్ అన్నారు. బీజేపీతో తమకు ఎలాంటి సంబంధం లేదుని స్పష్టం చేశారు.
12: 22 PM
బీఆర్ఎస్, బీజేపీది ఫెవికాల్ సంబంధం: రేవంత్‌రెడ్డి
సీఎంను మార్చుకునే విషయం కూడా మోదీ ఇక్కడే చెప్పారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కేసీఆర్ తమకు కొన్ని చెబుతారు. కొన్ని దాస్తారని అన్నారు. బీఆర్ఎస్, బీజేపీది ఫెవికాల్ సంబంధమన్నారు.
12: 16 PM
బీఆర్ఎస్ పదేళ్లుగా కేంద్రానికి అండగా నిలిచింది: సీఎం రేవంత్ రెడ్డి
బీఆర్ఎస్ పదేళ్లుగా కేంద్రానికి అండగా నిలిచిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కేంద్రం తెచ్చే అన్ని బిల్లులకు బీఆర్ఎస్ మద్దతు పలికిందని తెలిపారు. బీఆర్ఎస్,బీజేపీ నేతలు కలిసి పలుసార్లు చర్చించుకున్నారని పేర్కొన్నారు.
12: 16 PM
మీరిచ్చిన హామీలనే మీకు గుర్తు చేస్తున్నాం: పోచారం
కాంగ్రెస్ ఇచ్చిన హామీలనే తమకు గుర్తు చేస్తున్నామని పోచారం శ్రీనివాస్ అన్నారు. హామీలన్నీ నెరవేరిస్తే తమకే మంచిపేరు వస్తుందని సలహా ఇచ్చారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని హితవు పలికారు.
11:57 AM
ఫార్మా సిటీ రద్దు చేస్తామన్న ఆలోచన మంచిది కాదు : పల్లా రాజేశ్వర్ రెడ్డి
ఫార్మా సిటీ రద్దు చేస్తామన్న ఆలోచన మంచిది కాదని పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. ఫార్మా సిటీ రద్దు ప్రచారంతో పారిశ్రామికవేత్తల్లో ఆందోళన నెలకొందన్నారు. ఫార్మా సిటీకి హైదరాబాద్ రాజధానిగా ఉందని తెలిపారు. ఐటీ ఉత్పత్తుల్లో మనం అగ్రస్థానం సాధించామని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో మరిన్ని ఏఐ, డ్రోన్స్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరారు. తమ ప్రభుత్వంలో లక్షా 60 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని తెలిపారు. నర్సుల పోస్టులు భర్తీ చేశామని పేర్కొన్నారు.
ప్రగతి భవన్‌లోనే ప్రజా సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టామన్నారు. సింగరేణి సమస్యలు పరిష్కరించింది ప్రగతి భవన్‌లోనేనని గుర్తు చేశారు. ప్రతిరోజు ప్రజాభవన్‌కు వస్తానని సీఎం చెప్పారని గుర్తు చేశారు. ప్రజాభవన్‌లో గంటసేపైనా ప్రజల కష్టాలు వింటా అని సీఎం చెప్పారని అన్నారు. రెండోరోజు నుంచి సీఎం ప్రజాభవన్‌కు వెళ్లలేదని ప్రజల కష్టాలు వినలేదని ఆరోపించారు.
11:52 AM
అందరికీ అవకాశం ఇవ్వాలనేదే మా ప్రభుత్వ ఉద్దేశం : మంత్రి శ్రీధర్ బాబు
రాష్ట్ర ఆర్థిక ప్రగతి విషయంలో ఎలాంటి భేషజాలు లేవని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. అభివృద్ధి అనేది నిత్యం కొనసాగుతుందని తెలిపారు. అందరికీ అవకాశం ఇవ్వాలనేదే తమ ప్రభుత్వ ఉద్దేశమని చెప్పారు. ఒకరిద్దరికే అవకాశం ఇవ్వవద్దని రాహుల్‌గాంధీ చెప్పారని అన్నారు.పెట్టుబడుదారులను స్వాగతిస్తామని స్పష్టం చేశారు. క్రానీ క్యాపిటల్‌ను ప్రోత్సహించే ఆలోచనే తమకు లేదన్నారు. రాష్ట్ర అభివృద్ధికి సలహాలు, సూచనలు ఇవ్వమని మంచివి అయితే తీసుకుంటామన్నారు. రాజకీయాలు వదిలి రాష్ట్ర ప్రగతి గురించి మాట్లాడదామన్నారు.
11:50 AM
అదానీ ఇక్కడకు వస్తే తెలంగాణ ఆర్థిక ప్రగతి ఆగిపోతుంది: పల్లా
యాదగిరిగుట్ట పనుల్లో అవినీతి జరిగిందని ఐలయ్య అన్నారు. యాదగిరిగుట్ట అభివృద్ధి పేరుతో కమిషన్లు దండుకున్నారని ఆరోపించారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ఇంకా పెంచాలని పల్లా రాజేశ్వర్‌రెడ్డి సూచించారు. గత ప్రభుత్వం ఎన్నో విజయాలు సాధించిందన్నారు. పదేళ్లలో 17 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చామని తెలిపారు. క్రానీ క్యాపిటల్ వద్దని రాహుల్ గాంధీ చెప్పారని అన్నారు. అదానీ ఇక్కడకు వస్తే తెలంగాణ ఆర్థిక ప్రగతి ఆగిపోతుందని మండిపడ్డారు.
11:47 AM
మహిళలకు ఇస్తామన్న రూ.2,500 వెంటనే ఇవ్వాలి : సునీతా లక్ష్మారెడ్డి
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని స్వాగతిస్తున్నామని సునీతా లక్ష్మారెడ్డి అన్నారు. బస్సు ట్రిప్పులు తగ్గించడం వల్ల మహిళలు, విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బస్సులు పెంచాలని ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా చూడాలని సూచించారు. మహిళలకు ఇస్తామన్న రూ.2,500 వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు.
11:44 AM
ఆటో కార్మికులను రెచ్చగొడుతున్నారు: మంత్రి పొన్నం
ఆటో కార్మికులను రెచ్చగొడుతున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆత్మహత్యలు చేసుకునేలా ప్రేరేపిస్తున్నారని మండిపడ్డారు. కష్టాల్లో ఉన్న ఆటో కార్మికులకు అండగా నిలబడాలని కోరారు. ఆర్టీసీని గత ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని ఆరోపించారు.పెత్తందారీ మనస్తత్వం ఉన్నవారే ఇవాళ ఆటోల్లో ఎక్కారని అన్నారు.