Telangana Assembly Budget Session 2024 2nd Day : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు కొనసాగనున్నాయి. ఉదయం 10 గంటలకు సభ ప్రారంభంకాగానే ప్రశ్నోత్తరాల కార్యక్రమం కొనసాగనుంది. శాసనసభలో ప్రశ్నలు అడిగేందుకు మొత్తం పది ప్రశ్నలకు ఆమోదం లభించింది. ఇప్పటికే ఆయా శాఖలకు ఈ ప్రశ్నలను పంపించి సంబంధిత శాఖల మంత్రులు సమాచారం తెప్పించుకున్నారు. సభలో ఇందుకు సంబంధించిన సమాధానాలు ఇవ్వనున్నారు. మరోవైపు నేటి సమావేశాల్లో కేంద్ర సర్కార్ బడ్జెట్‌లో తెలంగాణకు చేసిన అన్యాయం గురించి కూడా చర్చ జరగనుంది. మరోవైపు ఇవాళ్టి నుంచి శాసనమండలి సమావేశాలు ప్రారంభం కానున్నాయి.
అసెంబ్లీలో అడిగే 10 ప్రశ్నలు ఇవే :
- పాఠశాలలు, కళాశాలల బస్సుల ఫిట్నెస్ తనిఖీలు
- తండాలు గ్రామపంచాయతీలుగా ఉన్నతీకరణ
- ఆర్టీసీ సిబ్బందిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తింపు
- వాణిజ్య పన్నుల శాఖలో అవకతవకలు
- నిజామాబాద్ పట్టణ అసెంబ్లీ నియోజకవర్గంలో క్రీడా సముదాయం
- తెలంగాణ రాష్ట్రంలో ఎన్ఐటీ ఉద్యోగులుగా గుర్తింపు
- ఆరోగ్యశ్రీ పెండింగ్ బిల్లుల చెల్లింపు
- ఫీజు రీఎంబర్స్‌మెంట్ బకాయిలు
- జాతీయ రహదారి విస్తరణ పనులు
- మూసీనదికి ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ చెరువుల అనుసంధానం
ఈ ప్రశ్నలు ముగిసిన అనంతరం మంగళవారం బీఏసీలో తీసుకున్న నిర్ణయాలను సభా నాయకుడు సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించనున్నారు. అనంతరం 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి నార్తన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ, ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్ వార్షిక నివేదికలను ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సభ ముందు ఉంచనున్నారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ లిమిటెడ్ 4,5 6 వార్షిక నివేదికలను శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు సభ ముందు ఉంచుతారు.