Irrigation Sector Allocations in Telangana budget 2024 : రాష్ట్ర పూర్తిస్థాయి బడ్జెట్‌ను నేడు శాసనసభలో ఆర్థికశాఖ మంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టనున్నారు. ఈక్రమంలో ఏఏ రంగాలకు బడ్జెట్లో ఎంత మొత్తం వెచ్చిస్తారో అనేది తెలియాల్సి ఉంది. ఎక్కువ మొత్తం వ్యవసాయశాఖకు కేటాయించగా ఆతర్వాత సాగునీటి పారుదల రంగానికి సుమారు రూ.29 వేల కోట్లు కేటాయించినట్లు తెలిసింది. కానీ ఇందులో సింహభాగం మాత్రం తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించడానికి, వడ్డాలు చెల్లించడానికే కేటాయింపులు చేసినట్లు సమాచారం.
ప్రాజెక్టుల నిర్మాణానికి రూ.9 వేల కోట్లు : రాష్ట్ర ప్రభుత్వం దీర్ఘకాలం నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసి, ఆయకట్టుకు నీరందించేలా పనులు పూర్తి చేస్తామని చెబుతూ వస్తోంది. కానీ వీటి అవసరాలకు తగ్గట్లుగా నిధులు కేటాయించే అవకాశాలు తక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే కాళేశ్వరం, సీతారామ ఎత్తిపోతల, వరద కాలువ, దేవాదుల, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులకు తీసుకున్న రుణాల్లో కొన్నింటికి అసలు తిరిగి చెల్లింపు ప్రారంభమైంది.
ఇంకా మిగిలిన వాటికి వడ్డీ కట్టాల్సి ఉంది. వీటన్నిటికీ కలిపి రూ. 18 వేల కోట్లు తప్పనిసరిగా కేటాయించాల్సిందేనని సంబంధిత వర్గాలు తెలిపాయి. నీటిపారుదలశాఖలో ఉద్యోగుల జీతభత్యాలు, ఎస్టాబ్లిష్మెంట్లకు రూ.2వేల కోట్లు కేటాయించగా, మిగిలిన రూ.9వేల కోట్లును ప్రాజెక్టుల నిర్మాణానికి కేటాయించే అవకాశంఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి.
ప్రాధాన్య ప్రాజెక్టులకు ఏ మేరకు ఇస్తారో :తక్కువ వ్యయంతో ఎక్కువ ఆయకట్టుకు నీరు ఇచ్చే ప్రాజెక్టులకు ఈ బడ్జెట్లో ప్రాధాన్యం ఇచ్చే అవకాశం ఉంది. ఇందుకు సంబంధించిన నిధులు కేటాయించే అంశంపై గత కొన్ని రోజులుగా మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి నీటిపారుదల శాఖ అధికారులతో కసరత్తు చేస్తున్నారు. మరి ఎంతవరకు బడ్జెట్లో కేటాయింపులు ఉంటాయో చూడాలి. ప్రాధాన్య ప్రాజెక్టుల్లో శ్రీశైలం ఎడమగట్టు కాలు(ఎస్ఎల్బీసీ), డిండి, భీమా, కోయిల్‌సాగర్, నెట్టెంపాడు, కల్వకుర్తి, దేవాదుల, సీతారామ ఎత్తిపోతల, మోదికుంటవాగు, చిన్న కాళేశ్వరం, నీల్వాయి, లోయర్ పెన్‌గంగ, చనాఖా-కోర్ట, పాలెంవాగు, ఎల్లంపల్లి, శ్రీరామసాగర్ రెండో దశ, సదర్మాట్ తదితర ప్రాజెక్టులు ఉన్నాయి.