Technical Issues in Indiramma House Survey :నిరుపేదలకు సొంతింటి కలను నిజం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని తీసుకొచ్చింది. ఇందులో భాగంగా ప్రభుత్వం చేపట్టిన ఇంటింటి సర్వేకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో సిగ్నల్ సమస్యతో సర్వే ఆగిపోతుంటే, పట్టణాల్లో సర్వర్ మొరాయిస్తుండటంతో సర్వేకు ఆటంకాలు ఏర్పడుతున్నాయి. ఈ నేపథ్యంలో సర్వే యాప్ అప్‌డేట్ అయిన తర్వాత సర్వేయర్లు మరిన్ని సమస్యలు ఎదుర్కొంటున్నారు. రోజుకు ఒక్కో సర్వేయర్ సుమారు 40 కుటుంబాల వరకు సర్వే చేయాల్సి ఉండగా, సాంకేతిక సమస్యలతో 20 కుటుంబాల వివరాలు నమోదు చేయడమే పెద్ద సవాల్‌గా మారిందని సర్వే అధికారులు చెబుతున్నారు.
సెల్‌ఫోన్ సిగ్నల్స్ లేక ఇబ్బందులు : తాజాగా పెద్దపల్లి జిల్లా మంథని మండలం ఉప్పట్లలో ఇందిరమ్మ ఇళ్ల సర్వే నిర్వహిస్తున్న సిబ్బందికి ఇలాంటి ఇబ్బందే ఎదురవుతుంది. ఇందిరమ్మ ఇళ్ల సర్వే చేపడుతున్న సిబ్బందికి పలుచోట్ల సెల్‌ఫోన్ సిగ్నల్స్ సరిగా లేక ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడి గ్రామం పక్కన గోదావరి ప్రవహిస్తుంది. గతంలో నది అవతలి వైపున ఉన్న టవర్‌తో సిగ్నల్స్ ఉండేవి. ఆ తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా సుందిళ్ల బ్యారేజీ కరకట్టలను నిర్మించినప్పటి నుంచి సిగ్నల్స్ ఇబ్బందులు ఎదురవుతున్నాయి.