TDP Leader Pattabhiram on YS Jagan :వైఎస్ జగన్‌పై తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభిరామ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తాడేపల్లిలో ఆయన ఇంటి చుట్టూ కట్టిన ఇనుప కంచెకు రూ.12.85 కోట్లు ఖర్చు చేశారని విమర్శించారు. దేశంలోని అత్యున్నతమైన రాష్ట్రపతి భవన్, ప్రధానమంత్రి నివాసాలకే అలాంటి కంచెను ఏర్పాటు చేయలేదని ఎద్దేవా చేశారు. ఏపీలోని మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం పట్టాభిరామ్ మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా పట్టాభిరామ్ మాట్లాడుతూ, రుషికొండ ప్యాలెస్‌లోని బాత్‌టబ్‌లు, మసాజ్ టేబుళ్లు, కప్‌బోర్డులు, ప్రతి జిల్లాలోనూ వైఎస్సార్సీపీ కార్యాలయాలు, తాడేపల్లి ప్యాలెస్‌లే ఆయన విలాసాలకు నిదర్శనమని ధ్వజమెత్తారు. సాధారణ పరిపాలన విభాగం జగన్ ఇంటి చుట్టూ నిర్మించుకున్న ఇనుప కంచెకు రూ.12.85 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపిందన్నారు. ఆయన తాడేపల్లి ప్యాలెస్ దక్షిణం వైపు 0.148 ఎకరాల స్థలంలో వ్యూకట్టర్ నిర్మాణానికే రూ.3.25 కోట్లు మంజూరు చేసిందని తెలిపారు.
ఆ ఘనత జగన్‌కే సొంతం : వైఎస్ జగన్ తన ఇంటి చుట్టూ భద్రతా ఏర్పాట్లకే మొత్తం రూ.16.10 కోట్లు ప్రజాధనాన్ని ఖర్చు చేశారని టీడీపీ నేత పట్టాభిరామ్ దుయ్యబట్టారు. ప్రజలను అణిచివేసే నియంతలే ఇలా ఇనుప కంచెలు వంటివి వేసుకుంటారని మండిపడ్డారు. గత ఐదేళ్ల జగన్ హయాంలో విలాసాల పేరుతో ఏకంగా రూ.5 కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారన్నారు.