Police Arrested 12 Members Gang in Domalguda Robbery Case :వ్యాపారంలో తన అన్న బాగా ఎదిగిపోతున్నాడని, ఆస్తులు కూడబెడుతున్నాడనే కక్షతో సొంత సోదరుడిని ఎలాగైనా రోడ్డున పడేలా చేయాలని ఓ వ్యక్తి పక్కా పథకం ప్రకారం ఏకంగా సోదరుడి ఇంట్లోనే దోపిడీ చేయించాడు. కేసు నమోదు చేసిన పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో గుట్టు రట్టయింది. ఈ కేసుతో సంబంధం ఉన్న రౌడీషీటర్‌తో పాటు న్యాయవాది సహా 12 మంది ముఠాను టాస్క్‌ఫోర్స్, మధ్య మండలం పోలీసులు పట్టుకున్నారు. ఈ నెల 12వ తేదీన దోమలగూడలోని అర్వింద్నగర్లో జరిగిన దోపీడీ కేసును పోలీసులు ఛేదించారు.
స్థానికంగా నివసించే బంగారం వ్యాపారి రంజిత్ గోరాయి నివాసంలో భారీ దోపిడీ జరిగింది. ఇంట్లోని వారిని మరణాయుధాలతో బెదిరించిన దొంగలు, దోపిడీలో రూ.కోటికి పైగా బంగారు ఆభరణాలు, నగదు దోచుకుపోయారు. బాధితుడు రంజిత్ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు, సీసీటీవీ కెమెరాలతో దోపిడీ జరిగిన తీరును పరిశీలించగా వారికి ఎలాంటి ఆధారాలు లభించలేదు. అన్ని కోణాల్లో ఆరా తీసిన పోలీసులు, చివరకు రంజిత్ సోదరుడు ఇంద్రజిత్ గోరాయిపై అనుమానం వచ్చి అతన్ని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు గుట్టు రట్టయింది. అన్న రంజిత్ వ్యాపారంలో బాగా ఎదిగిపోయి, ఆస్తులు కొనుగోలు చేస్తున్నాడని, ఎట్టి పరిస్థితుల్లోనైనా అతన్ని రోడ్డు మీదకు తేవాలనే కక్షతోనే తన స్నేహితులతో కలిసి దోపిడీ చేయించినట్లు పోలీసుల విచారణలో తేలింది.
సోదరుడిని ఎలాగైనా రోడ్డున పడేయాలని : ఈ వ్యవహారంలో ఇంద్రజిత్‌కు మైలార్‌దేవ్‌పల్లికి చెందిన రౌడీ షీటర్ మహ్మద్ అర్బాజ్ సహకరించాడు. దోపిడీకి న్యాయవాది మహ్మద్ నూరుల్లా సూత్రధారిగా వ్యవహరించినట్టు పోలీసులు దర్యాప్తులో గుర్తించారు. తరచూ తన స్నేహితులతో సోదరుడిని ఎలాగైనా రోడ్డున పడేయాలని, అందుకు సహకరించాలని ఇంద్రజిత్ కోరేవాడని పోలీసులు తెలిపారు. దీంతో అంతా కలిసి దోపీడీ పథకం వేసినట్టు తేలింది. న్యాయవాది నూరుల్లా, రౌడీషీటర్ మహ్మద్ అర్బాజ్, వీరిద్దరూ కలిసి మరో 9 మంది ముఠా సభ్యులతో దోపిడీకి ప్రణాళిక రచించి, పథకం ప్రకారం అమలు చేసినట్టు బయట పడింది.