Summer Temperature Increases in Telangana : ఎండకాలం ప్రారంభంలోని భానుడు భగభగ మంటున్నాడు. జనాలు బయటికి రావాలంటే జంకుతున్నారు. రాష్ట్రంలో ఇవాళ్టి నుంచి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దక్షిణ దిశ నుంచి రాష్ట్రంలోకి కిందిస్థాయి గాలులు వీచడం వల్ల వచ్చే అయిదు రోజుల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 2 డిగ్రీల సెల్సియస్ నుంచి 3 డిగ్రీల సెల్సియస్ వరకు పెరుగుతాయని వెల్లడించింది. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఎండలు మండుతున్నాయి. సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు చేరువలో ఉన్నాయి.
సిద్దిపేట జిల్లాలో 39.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా సంగారెడ్డి జిల్లా కల్హేర్లో 38.7 డిగ్రీలు, మెదక్ జిల్లా శివ్వంపేటలో 37.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎండలు పెరగనున్న నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి, జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఈ క్రమంలో ఎండ వేడికి ప్రజలు ఎవరూ బయటికి రాకపోవడంతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి.
IMD 150 years celebration in Hyderabad : ఇదికాగా మరోవైపు వాతావరణ శాఖ 150 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా హైదరాబాద్లో ఐఎండీ (IMD) వ్యవస్థాపక వేడుకలు ఘనంగా నిర్వహించారు. వాతావరణ శాఖ సంచాలకులు డాక్టర్ నాగరత్నం అధ్యక్షతన జరిగిన సదస్సుకు పర్యావరణ వేత్త, వర్షపు నీరు ప్రాజెక్ట్ ఫౌండర్ కల్పన రమేశ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నీటి సంరక్షణ సవాలు అంశంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. వాతావరణ మార్పులు, నీటి సంరక్షణపై విద్యార్థులకు అవగాహన కల్పించిన కల్పన రమేశ్, భవిష్యత్ తరాలకు సురక్షితమైన నీటిని అందించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.