Minors Bike Riding Causing Road Accidents : మైనర్లు బైక్, నాలుగు చక్రాల వాహనాలు నడుపుతూ ప్రమాదాలకు కారణమవుతోన్న ఘటనలు ఎక్కువవుతున్నాయి. యుక్తవయసులో డ్రైవింగ్ విన్యాసాలు, తెలియనితనం వారితో పాటు ఇతర వాహనదారుల ప్రాణాల మీదకు తెస్తున్నారు. అధిక వేగం, మద్యం సేవించి బైక్, ఇతర వాహనాలు నడపడం, నిబంధనల్ని బేఖాతరు చేయడం వంటి కారణాలతో మైనర్లు అర్ధాంతరంగా మృతి చెందుతున్నారు. ఇంకెంతోమంది క్షతగాత్రులు అవుతున్నారు. తల్లిదండ్రులకు తీరని వేదన మిగుల్చుతున్నారు. ఆర్థిక స్తోమత అంతంతే ఉన్నా, అతిగారాబం కారణంగా తల్లిదండ్రులు రూ.లక్షలు పెట్టి బైక్‌లు కొనుగోలు చేసి వారికి బహుమానంగా ఇస్తున్నారు. కానీ ముందున్న ప్రమాదాలను గ్రహించలేకపోతున్నారు.
జరిమానా - మూడు సంవత్సరాలు జైలు : మోటారు వాహనాల చట్టం ప్రకారం డ్రైవింగ్ లైసెన్సుకు దరఖాస్తు చేసేందుకు 18 సంవత్సరాలు పూర్తి అవ్వాలి. కానీ, ఆ వయసుకు ముందే మైనర్లు వాహనాలు నడుపుతున్నారు. ప్రమాదాల బారిన పడుతూ ప్రాణాల మీదుకు తెచ్చుకుంటున్నారు. మైనర్లు వాహనాలు నడుపుతూ పట్టుబడితే తల్లిదండ్రులు, సంరక్షకుడితో పాటు మైనర్లకు కౌన్సెలింగ్ ఇస్తారు. అనంతరం మేజిస్ట్రేట్ రూ.5,000 నుంచి రూ.25,000 వరకు జరిమానా, మూడు సంవత్సరాల జైలు శిక్ష విధిస్తారు.
పిల్లల్ని బైక్ మీద తీసుకెళ్తున్నారా? :
- చాలా మంది స్కూల్ బ్యాగులు బైక్ హ్యాండిల్‌కు తగిలిస్తున్నారు. రోడ్ మలుపుల్లో హ్యాండిల్ తిరగక అదుపు తప్పి కింద పడే అవకాశం ఉంది.
- కొందరు ఆలస్యంగా ఇంటి నుంచి బయల్దేరతారు. స్కూలు టైం మించి పోతుందని వేగంగా లేదా రాంగ్ రూట్‌లో ప్రయాణాలు చేస్తున్నారు.
- పిల్లలు వాహనం మీద ఉన్నప్పుడు ఇతర వాహనాలను ఓవర్‌టేక్ చేయక పోవడం మంచిది. నాలుగు సంవత్సరాల లోపు చిన్నారుల్ని వెనక కూర్చోబెట్టుకోవద్దు.
హైదరాబాద్‌లోని బహదూర్‌పుర నుంచి ఆరాంఘర్ వెళ్లే క్రమంలో సోమవారం అర్ధరాత్రి దాటాక ఒకే బైక్‌పై ముగ్గురు మైనర్లు అతివేగంగా ప్రయాణం చేస్తూ అదుపుతప్పి డివైడర్‌ని ఢీకొట్టారు. ఈ ఘటనలో ఆ ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. అతి వేగమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. మైనర్ల చేతికి వాహనాలు ఇస్తే ప్రమాదాలు జరుగుతాయనడానికి ఈ దుర్ఘటన ఓ ఉదాహరణ.
ఆరాంఘర్ ఫ్లై ఓవర్‌పై డివైడర్‌ను ఢీకొన్న బైక్ - ముగ్గురు మైనర్లు మృతి