Job Opportunities with Technical Courses : తక్కువకాల వ్యవధి చదువుతో ఉపాధి అవకాశాలు పుష్కలంగా ఉన్న కోర్సు ఐటీఐ. పారిశ్రామిక శిక్షణ పూర్తిచేసిన వారిలో 90 శాతం మంది ఉపాధి పొందుతున్నారు. పదోతరగతి పూర్తి చేసి, వయో పరిమితితో సంబంధం లేకుండా ఐటీఐ కోర్సుల్లో చేరొచ్చని, నిపుణులు చెబుతున్నారు.
Nizamabad ITI Diploma Colleges Admissions Open :నిజామాబాద్ జిల్లాలో ఐదు ప్రభుత్వ, 3 ప్రైవేట్ ఐటీఐలుంటే 1516 మందికి ప్రవేశాలు పొందేఅవకాశం ఉంది. ఐటీఐలో ఏడాది, రెండేళ్ల కాల వ్యవధికోర్సులు ఉన్నాయి. కోర్సులు పూర్తైన వారికి ప్రముఖ కంపెనీలైన బీహెచ్‌ఈఎల్, ఈసీఐఎల్, బీడీఎల్, ఆర్‌ఆర్‌బీ, మహీంద్రా అండ్ మహీంద్రా వంటి కంపెనీల్లో అప్రెంటిస్ పూర్తి చేసుకొని చాలామంది ఉద్యోగాలు చేస్తున్నారు. కోర్సుల్లో చేరే విద్యార్థులకు స్కాలర్‌షిప్‌తోపాటు హాస్టల్ సదుపాయం ఉందని జిల్లా ఐటీఐ కళాశాలల సమన్వయకర్త కోటిరెడ్డి చెబుతున్నారు.
"మా దగ్గర అడ్మిషన్ నోటిఫికేషన్ మొదలైంది. వచ్చే నెల పదో తేదీ వరకు ఆన్లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. తక్కువ కాలంలో ఉపాధి పొందాలనుకునే వారికి ఐటీఐ ఒక వరంగానే చెప్పుకోవచ్చు. మావద్ద డిఫరెంట్ కోర్సులు, ట్రేడ్‌లు ఉన్నాయి. అలానే ఏడాది, రెండేళ్లు వ్యవధి గల ట్రేడ్‌లకు సంబంధించి కోర్సులు ఉన్నాయి."-కోటిరెడ్డి, జిల్లా ఐటీఐ కళాశాలల సమన్వయకర్త
పాలిటెక్నిక్ చదువుతోనూ ఉద్యోగంలో చేరే అవకాశం :పదోతరగతి తర్వాత ఐటీఐతో పాటు పాలిటెక్నిక్‌లో మూడేళ్ల డిప్లొమా కోర్సులో చేరేందుకు విద్యార్థులకు అవకాశం ఉంది. పాలీసెట్ ప్రవేశపరీక్ష రాస్తే ర్యాంకు ఆధారంగా సీటు లభిస్తుంది. మూడేళ్ల కోర్సులో సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, కంప్యూటర్ వంటి బ్రాంచ్‌లు అందుబాటులో ఉన్నాయి. రెండున్నరేళ్ల కోర్సు, ఆరు నెలలు ఇండస్ట్రీయల్ ట్రైనింగ్ ఉంటుంది.