Students Facing Problems in Kondapochamma Sagar Villages :కోటి ఎకరాలకు సాగు నీరందించే లక్ష్యంతో గత ప్రభుత్వం కొండపోచమ్మ సాగర్ జలాశయాన్ని నిర్మించింది. దీంతో ములుగు మండలంలోని నాలుగు గ్రామాలు పూర్తిగా ముంపునకు గురయ్యాయి. ఈ గ్రామాలను 2013లో ఆర్ అండ్ ఆర్ కాలనీ(R&R Colony) ఏర్పాటు చేసి పునరావాసం కల్పించారు. అన్ని శాఖల వ్యవహారాలన్నీ పాత గ్రామాల పేరుతోనే సాగుతున్నాయి. విద్యా వ్యవస్థను మాత్రం తున్కిబొల్లారంలో(Thunki Bolarum) విలీనం చేస్తున్నట్లు అధికారులు ఉత్తర్వులివ్వడంతో అప్పట్లో నిర్వాసితులు ఆందోళనకు దిగారు. దీంతో పునరావాస కేంద్రంలోనే పాఠశాలలు నిర్వహిస్తామని అధికారులు హామీ ఇచ్చారు.
మామిడ్యాలలో నిర్మించిన భవనంలోనే నాలుగు గ్రామాలకు చెందిన బడులు నడుపుతున్నారు. అదనంగా భవనాలు మాత్రం నిర్మించలేదు. దీంతో విద్యార్థులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. నూతన భవనాలు నిర్మించకపోవడంతో నాలుగు గ్రామాలకు చెందిన 242 మంది విద్యార్థులకు ఒకే భవనంలో పాఠాలు బోధిస్తున్నారు. తరగతి గదులు చాలకపోవడంతో ఉపాధ్యాయులు, విద్యాకమిటీ సభ్యుల సహకారంతో వరండాలో దుప్పట్లు అడ్డంగా కట్టి విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్నారు. మరికొందరు పిల్లలను చెట్ల కింద కూర్చోబెడుతున్నారు.
'కొండపోచమ్మ జలాశయం వల్ల సర్వం నష్టపోయాం. ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోలేదు. దయచేసి మాకు న్యాయం చేయండి. పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని హై స్కూల్, ప్రైమరీ స్కూల్ వేర్వేరుగా నిర్మించాలని కోరుతున్నాం. తరగతి గదులు లేక చాలా ఇబ్బందిపడుతున్నాం'. - యాదగిరి, విద్యాకమిటీ ఛైర్మన్
Students Facing Problems for School in Mulugu Mandal :బోధన గదిలోనే బీరువాలను అడ్డంగా పెట్టి ఉపాధ్యాయులు కార్యాలయం ఏర్పాటు చేసుకున్నారు. వరండాలో, ఆరుబయట పాఠాలు చెబుతుండటంతో అర్ధం కావడం లేదని విద్యార్థులు అవేదన చెందుతున్నారు. శౌచాలయాలు లేకపోవడంతో విద్యార్థినిలు అవస్థలు పడుతున్నారు. బడి చుట్టూ ప్రహరీ లేదు. పాఠశాల కోసం నిర్మిస్తున్న భవనానికి నిధులు లేక పనులు ఆగిపోయాయి.