Food Poison in Kailasapatnam Orphanage Home :ఆంధ్రప్రదేశ్లోనిఅనకాపల్లి జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కోటవురట్ల మండలం కైలాసపట్నంలో 2 రోజుల క్రితం ఓ అనాథాశ్రమంలో 27 మంది విద్యార్థులు సమోసాలు తిని అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటనలో ముగ్గురు చిన్నారులు మృతి చెందారు. కోటవురట్ల మండలం కైలాసపట్నంలో ఓ క్రిస్టియన్ ఆర్గనైజేషన్ సంస్థ అల్లూరి మన్యం జిల్లాలోని చింతపల్లి, కొయ్యూరు, గూడెం కొత్త వీధి, పాడేరు, అరకు మండలాలకు చెందిన గిరిజన విద్యార్థులకు వసతి కల్పించి విద్యను అందిస్తోంది.
Anakapalli Students Eating Contaminated Food :ఈ సంస్థలో సుమారు 80 మందికి పైగా విద్యార్థులు చదువుతున్నారు. వీరికి శనివారం సాయంత్రం అల్పాహారంగా సమోసాలను పెట్టారు. సమోసాలు తిన్న కొంతసేపటికి విద్యార్థులు వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురయ్యారు. విషయం తెలుసుకున్న నిర్వాహకులు తీవ్ర అస్వస్థతకు గురైన నలుగురు విద్యార్థులను ఆసుపత్రికి తరలించారు.
సోమవారం చింతపల్లి మండలం నిమ్మలపాలెం చెందిన జాషువా, కొయ్యూరు మండలానికి చెందిన భవాని, చింతపల్లికి చెందిన శ్రద్ధ మృతి చెందారు. మరో 24 మంది విద్యార్థులు నర్సీపట్నం, అనకాపల్లి, విశాఖపట్నం కేజీహెచ్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. నర్సీపట్నం ప్రాంతీయ ఆసుపత్రిలో ఏడుగురు పిల్లలకు చికిత్స అందిస్తున్నారు. విశాఖ కేజీహెచ్‌కు నలుగురు బాలలను తరలించారు. నర్సీపట్నం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని ఆర్డీవో జైరాం పరామర్శించారు. మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు.