Street Vendors Problems In Nalgonda : నల్గొండ ఎన్జీ కళాశాల సమీపంలో ప్రధాన రహదారిని ఆనుకుని చిరు వ్యాపారాలు చేస్తూ అనేక కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. పండ్లు, పూలు, కొబ్బరిబోండాలు, కుండలు ఇలా అనేక వ్యాపారాలు చేస్తూ బతుకుతున్న కుటుంబాలు ఎన్నో. ప్రధాన రహదారి విస్తరించడంతో వ్యాపారం చేసుకునేందుకు వీలు లేకుండా పోయింది. ఈ క్రమంలో చిరువ్యాపారుల (Street Vendors) కోసం గత ప్రభుత్వం మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో వీధి విక్రయదారుల సముదాయం నిర్మించింది. అక్కడ సూమారు 25 మోడల్ దుకాణాలు ఏర్పాటు చేశారు. అయితే ఇప్పటివరకు ఇవి ప్రారంభోత్సవానికి నోచుకోలేదు. ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ వ్యాపారం చేస్తున్నామని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
చిరు వ్యాపారుల్లో ఆశలు రేకెత్తించిన సీఎం రేవంత్ మాటలు - క్షేత్రస్థాయిలో అందుకు భిన్నమైన పరిస్థితులు
Street Vendors issue : ఎన్నికల ముందు నల్గొండలో పర్యటించిన కేటీఆర్ (KTR) ఆ సముదాయలను ప్రారంభించారు. ఆ తర్వాత ఎన్నికల కోడ్ వల్ల పెండింగ్ పనులు ఉండటం వల్ల ఈ దుకాణాలు పంపిణీ నిలిచిపోయింది. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ మోడల్ దుకాణాలను వ్యాపారులకు అనుకూలంగా మార్చి ఇస్తామని ప్రకటించింది. కానీ ఇప్పటివరకు అవి అందుబాటులో తేలేదని బాధితులు తెలిపారు. ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకొని ఇప్పటికైనా మోడల్ దుకాణాలను తమకు అనుకూలంగా మార్చి అందుబాటులోకి తేవాలని చిరు వ్యాపారులు కోరుతున్నారు.
"అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ మోడల్ దుకాణాలను వ్యాపారులకు అనుకూలంగా మార్చి ఇస్తామని చెప్పింది. వాటిని అందుబాటులో తీసుకురాలేదు. ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకొని ఇప్పటికైనా మోడల్ దుకాణాలను మాకు ఇవ్వాలి. వేసవి కాలంలో పండ్లు పాడైపోతున్నాయి."-చిరు వ్యాపారులు